ఈ మధ్య కాలంలో తమన్ ఎక్కువ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన హీరో బాలకృష్ణ ఒక్కరే. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ రూపంలో వరస సక్సెస్ అందుకున్న ఈ క్రేజీ కాంబో త్వరలో అఖండ 2 తాండవంతో పలకరించబోతోంది. ఈసారి బీజీఎమ్ ఎలా ఉండబోతోందో, థియేటర్ సౌండ్ సిస్టంలు ముందుగానే ఎలా అప్ గ్రేడ్ చేసుకోవాలో అంటూ ఫ్యాన్స్ అప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు. డాకు ఈవెంట్ తో పాటు పలు సందర్భాల్లో తమన్ ఇంటి పేరుని నందమూరిగా మారుస్తున్నట్టు ప్రకటించడం ఇద్దరి మధ్య బాండింగ్ ని మరింత బలపరిచింది. అయితే ఈ స్టోరీ ఇప్పటిది కాదు.
తమన్ డ్రమ్స్ వాయించే కళాకారుడిగా కెరీర్ మొదలుపెట్టింది 1994లో వచ్చిన భైరవ ద్వీపంతో. దానికి సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్. డెబ్యూకే విజయ లాంటి సంస్థలో పని చేసే ఛాన్స్ దక్కడం తమన్ ను సంతోషంలో ముంచెత్తింది. మొదటి రోజు రెమ్యునరేషన్ గా మూడు పది రూపాయల నోట్లు అంటే ముప్పై రూపాయలు చెల్లించారు. అలా తొమ్మిది రోజుల పాటు ఆ సినిమాకు పని చేసినందుకు గాను 270 రూపాయలు తమన్ చేతికి ఇచ్చారు. ఇది మరీ పెద్ద మొత్తం కాకపోయినా పట్టుమని ఇరవై ఏళ్ళు లేని కుర్రాడికి అది మంచి మొత్తమే. బాలయ్యతో తమన్ ఫౌండేషన్ ఆ జానపద క్లాసిక్ తోనే జరిగిపోయింది.
అలా ప్రస్థానం మొదలుపెట్టిన తమన్ ఇప్పుడు ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడనేది బయటికి చెప్పడు కానీ యాంకర్ సుమతో జరిగిన ఒక ఇంటర్వ్యూలో పైన సంఘటన చెప్పుకొచ్చాడు తమన్. ట్విట్టర్ ధోరణి పట్ల అసహనం చూపించే తమన్ ఆ మధ్య గేమ్ ఛేంజర్ రిలీజ్ కు ముందే దాన్ని డిజాస్టర్ అనేలా క్యాంపైన్ చేయడం చాలా బాధ కలిగించిందని చెప్పుకొచ్చాడు. ట్రోలింగ్ పతాక స్థాయికి చేరిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఏడాది అఖండ 2, ఓజి, ది రాజా సాబ్, తెలుసు కదాతో పాటు తమిళ సినిమా ఇదయం మురళికి పని చేస్తూ అందులో ఆర్టిస్టుగా కూడా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. బాయ్స్ తర్వాత తమన్ తెరమీద కనిపించబోయేది ఇందులోనే.
Gulte Telugu Telugu Political and Movie News Updates