అభిమానులు భయపడినట్టే జరిగేలా ఉంది. మే 9 హరిహర వీరమల్లు వస్తుందని గంపెడాశలతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి షాక్ ఇస్తూ మరోసారి వాయిదా తప్పకపోవచ్చని వస్తున్న వార్త వాళ్లలో కలకలం రేపుతోంది. ఇప్పటికే విపరీతమైన పోస్ట్ పోన్లతో దీని మీద బజ్ తగ్గిపోయింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే మొదటిసారి అత్యధిక బడ్జెట్ తో రెండు భాగాలుగా రూపొందుతున్న విజువల్ గ్రాండియర్ ఇది. ఇంకా చెప్పాలంటే ఓజి కంటే దీనికే ఎక్కువ ఖర్చయ్యింది. పవర్ స్టార్ తో ఖుషి లాంటి ఇండస్ట్రీ హిట్ బంగారం లాంటి కమర్షియల్ పేయర్ తీసిన నిర్మాత ఏఎం రత్నంకి ఇవన్నీ శరాఘాతంలా మారుతున్నాయి.
ఇంకొక్క రెండు మూడు రోజులు డేట్స్ ఇస్తే పవన్ భాగానికి సంబంధించిన షూట్ అయిపోతుందని ఒక పక్క, లేదూ అవి తీయకుండానే పార్ట్ 1కి సరిపడా ఫైనల్ కాపీ సిద్ధమవుతుందని ఇంకో పక్క రకరకాల ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. డబ్బింగ్, విఎఫెక్స్, ఎడిటింగ్, రీ రికార్డింగ్ తదితర పనులన్నీ జరుగుతున్నాయని మొన్నీమధ్యే పిఆర్ నుంచి వచ్చిన సందేశం సంతోషం కలిగించినా ఆ తర్వాత మళ్ళీ ఎలాంటి అప్డేట్ లేకపోవడం కొత్త అనుమానాలు లేవనెత్తుతోంది. పవన్ వ్యక్తిగత సమస్యలు, రాజకీయ వ్యవహారాలతో పాటు వెన్ను నొప్పి ఇబ్బంది పెట్టడం వల్ల షూటింగ్ కు రాలేకపోతున్నట్టు అంతర్గత వర్గాలు చెబుతున్న మాట.
హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ లాంచ్ 2020 జనవరిలో జరిగింది. అదే ఏడాది సెప్టెంబర్లో ప్రీ లుక్ పోస్టర్ వదిలారు. 2021 మార్చి, సెప్టెంబర్ నెలల్లో రెండు గ్లిమ్ప్స్ రిలీజ్ చేశారు. 2022 సంక్రాంతి రిలీజ్ అనౌన్స్ చేశారు. ఆ తర్వాత 2023 వేసవికి మార్చారు. అదీ జరగలేదు. 2024 మేలో టీజర్ వచ్చింది. ఇదే ఏడాది సమ్మర్, డిసెంబర్ రిలీజంటూ పలుమార్లు డేట్లు తిరిగాయి. 2025 జనవరిలో ఫస్ట్ ఆడియో సింగల్, ఫిబ్రవరిలో రెండో పాట వచ్చాయి. మార్చి 28 నుంచి విడుదల తేదీ మే 9కి మారింది. ఇప్పుడు మళ్ళీ కొత్త ఆప్షన్ వెతుక్కుంటోంది. ఇన్నేసి వాయిదాల మధ్య వీరమల్లు ప్రయాణం ఎప్పుడు గమ్యం చేరుతుందో ఎవరూ చెప్పలేరు.