మురుగదాస్‌ ధైర్యమే ధైర్యం

రమణ (ఠాగూర్ మాతృక), గజిని, హిందీ గజిని, తుపాకి, కత్తి లాంటి బ్లాక్ బస్టర్లలో ఒకప్పుడు వైభవం చూసిన దర్శకుడు మురుగదాస్. ఒక దశలో ఆయన ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడిగా ఉన్నాడు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి హీరోలు ఏరి కోరి మురుగతో సినిమాలు చేశారు.

బాలీవుడ్లో ఆమిర్ ఖాన్ సైతం ఎంతో ఎగ్జైట్ అయి తనతో సినిమా చేశాడు. ఇంత డిమాండ్ సంపాదించి ఇండియాలో టాప్ డైరెక్టర్లలో ఒకడిగా వెలుగొందిన మురుగదాస్‌‌కు ‘స్పైడర్’ దగ్గర్నుంచి టైం తిరగబడింది. ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. తర్వాత వచ్చిన సర్కార్, దర్బార్ కూడా తీవ్ర నిరాశకు గురి చేశాయి. దీంతో ఆయన కెరీర్లో చాలా గ్యాప్ వచ్చేసింది. అయినా నిరాశపడకుండా.. సికందర్, మదరాసి లాంటి రెండు క్రేజీ ప్రాజెక్టులను సెట్ చేసుకుని రంగంలోకి దిగాడు.

వీటిలో ముందుగా ‘సికందర్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చూశాక మురుగదాస్ గత చిత్రాలు చాలా బెటర్ అని తేల్చేశారు ప్రేక్షకులు. సల్మాన్ ఖాన్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘సికందర్’ నిలిచింది. మురుగదాస్ బౌన్స్ బ్యాక్ అవుతాడన్న ఆశలకు ఈ సినిమా తెరదించేసింది. పూర్తిగా ఔట్ ఆఫ్ ఫామ్‌లో కనిపించాడు మురుగ. దీంతో శివకార్తికేయన్ సినిమా ‘మదరాసి’ ఏమవుతుందో అన్న ఆందోళన మొదలైంది. ‘సికందర్’ ప్రోమోలన్నీ తేడాగా అనిపించాయి కానీ.. ‘మదరాసి’ కాస్త బెటర్‌గా అనిపించింది. పైగా శివ ‘అమరన్’ లాంటి బ్లాక్ బస్టర్ కొట్టిన ఊపులో ఉన్నాడు. దీంతో ఈ సినిమా మీద మురుగదాస్ అభిమానుల ఆశలు నిలిచాయి. కానీ మధ్యలో ‘సికిందర్’ వచ్చి పడింది. అది పెద్ద డిజాస్టర్ అయి.. మురుగదాస్ ఇమేజ్‌ను దారుణంగా దెబ్బ కొట్టింది.

ఈ స్థితిలో జనం ‘సికందర్’ను మరిచిపోయేవరకు కొంచెం ఆగాల్సింది. కానీ ‘మదరాసి’ మేకర్స్ మాత్రం ‘సికందర్’ రిలీజైన రెండు వారాలకే ‘మదరాసి’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. సెప్టెంబరు 5న ఈ చిత్రం విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఐతే ‘సికందర్’ తాలూకు నెగెటివిటీ తగ్గాక ఓ నెల ఆగి ‘మదరాసి’ అప్‌డేట్ ఇచ్చి ఉంటే బాగుంటుందని శివ, మురుగ అభిమానులు అంటున్నారు. అయితే జరిగిందేదో జరిగింది, ఈ సినిమా అయినా మురుగదాస్ మునుపటి మార్కును చూపించి తనకో మంచి విజయాన్నందిస్తే బాగుండని కోరుకుంటున్నారు.