సన్ రైజర్స్ గెలుపు : ప్రేమంటే ఇదేరా లింకు

నిన్న ఉప్పల్ స్టేడియంలో జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ మ్యాచ్ చూసి క్రికెట్ అభిమానులు ఊగిపోయారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఊచకోతకు 246 పరుగుల భారీ టార్గెట్ దూదిపింజెలా ఎగిరిపోవడంతో తెలుగు ప్రేమికుల సంతోషం అంతా ఇంతా కాదు. అసలు అసాధ్యం అనుకున్న దాని సుసాధ్యం చేసి కేవలం రెండు వికెట్లతోనే ఇంత పెద్ద ఫీట్ సాధించడం పట్ల సోషల్ మీడియా మొత్తం ప్రశంసలతో నిండిపోతోంది. వరస ఓటముల నుంచి ఇంత పెద్ద గెలుపు దక్కడం కన్నా సగటు ప్రేక్షకుడు కోరుకునేది ఏముంటుంది. ఇదంతా సరే కానీ ప్రేమంటే ఇదేరాకు కనెక్షన్ ఏంటనుకుంటున్నారా. అక్కడికే వద్దాం.

సన్ రైజర్స్ టీమ్ ని విక్టరీ వెంకటేష్ ఎంతగా ప్రేమిస్తారో తెలిసిందే. దాదాపు ప్రతి మ్యాచ్ మిస్సవకుండా హాజరవుతారు. స్టేడియంలో టాలీవుడ్ స్టార్లు పెద్దగా కనిపించరు కానీ వెంకీ మామ అటెండెన్స్ తప్పకుండా ఉంటుంది. ఆయనేం ఓనర్ కాకపోయినా స్వంత జట్టులా భావించి వస్తూ ఉంటారు. పబ్లిక్ కూడా అంతగా ఆయనకు కనెక్ట్ అయిపోయారు. ఇక పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతీ జింటా గురించి తెలిసిందే. ప్రేమంటే ఇదేరాలో ఈ ఇద్దరు కలిసి నటించారు. వెంకటేష్ హీరోయిన్ గా చేసిన ప్రీతీ జింటాని టీజ్ చేస్తూ అల్లరి చేసే సన్నివేశాలు చాలా ఉంటాయి. అవన్నీ ఇప్పుడు మీమ్స్ కోసం వాడేస్తున్నారు.

సందర్భంగా కూడా సింక్ కావడంతో నెటిజెన్లు ఎంజాయ్ చేస్తున్న వైనం కనిపిచింది. కేవలం ఈ ఒక్క సినిమాతోనే సన్ రైజర్స్ అనుబంధం ముడిపడలేదు. ఫ్యాన్స్ ముద్దుగా కాటేరమ్మ కొడుకులుగా పిలుచుకునే ఈ టీమ్ సలార్ తరహాలో సరైన టైం కుదిరితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుందని అభిమానుల అభిప్రాయం. పెద్ది, పుష్ప, రంగస్థలం, ఆర్ఆర్ఆర్, దేవర ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ల రెఫరెన్సులు ఐపీఎల్ లో వాడుతూనే ఉంటారు. అన్నట్టు వెంకీ ఇవాళ మ్యాచుకు రాలేదు. లేకపోతే తన ఒకప్పటి హీరోయిన్ ప్రీతీ జింటాని కలిసి కబుర్లు చెప్పేవాళ్ళు. ఇప్పుడు మిస్సయినా మరోసారి ఎలాగూ మ్యాచ్ ఉంటుంది అప్పుడు ట్రై చేయొచ్చు.