రెండేళ్ల క్రితం బేబీ రిలీజ్ ముందు వరకు తనెవరో పెద్దగా పరిచయం లేని పేరు. అల వైకుంఠపురములో అల్లు అర్జున్ చెల్లెలిగా నటించినప్పటికీ అది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా ఆమెకొచ్చిన గుర్తింపు తక్కువే. కానీ బేబీ ఒక్కసారిగా జాతకాన్ని మార్చేసింది. ఊహించని స్థాయిలో ఘనవిజయం సాధించి ఏకంగా వంద కోట్లకు దగ్గరగా వెళ్లడం ట్రేడ్ ని విస్మయపరిచింది. పెర్ఫార్మన్స్ పరంగా వైష్ణవి చైతన్యకు చాలా పేరొచ్చిన మాట వాస్తవం. ఇద్దరిని ప్రేమించి ఒకరి జీవితాన్ని నాశనం చేసే పాత్రలో జీవించేసింది. ఇంకొకరు అయ్యుంటే ఇంతగా ఆ క్యారెక్టర్ పండేది కాదేమోనన్న కామెంట్ కూడా నిజమే.
ఇక వర్తమానానికి వస్తే బేబీతో వచ్చిన ఇమేజ్ ని పెంచుకునే క్రమంలో వైష్ణవి చైతన్యకు తప్పటడుగులు పడుతున్నాయి. దిల్ రాజు బ్యానర్ కదాని గుడ్డిగా ఒప్పేసుకున్న లవ్ మీ ఇఫ్ యు డేర్ ఊసులో లేనంత దారుణంగా ఫ్లాప్ అయ్యింది. సినిమా పోతే పోయింది కానీ తనకు కలిగిన ప్రయోజనం సున్నానే. తాజాగా జాక్. సిద్ధూ జొన్నలగడ్డ సరసన అవకాశమంటే ఎవరైనా ఎందుకు కాదంటారు. బొమ్మరిల్లు దర్శకుడు, ఎస్విసిసి లాంటి బడా సంస్థ. ఆలోచించడానికి ఏమి లేదు. ఒప్పేసుకుంది. లేడీ డిటెక్టివ్ గా పేపర్ మీద వెరైటీగా అనిపించిన పాత్ర తెరమీద చూసేసరికి అత్తెసరుగా తేలిపోయి తుస్సుమనిపించింది.
ఇవి వైష్ణవి చైతన్య కావాలని చేసిన ఫ్లాపులు కాకపోయినా ఇకపై మరింత జాగ్రత్తగా ఉండటమైతే అవసరమే. ముఖ్యంగా కాంబోల కన్నా కథల ఎంపిక మీద దృష్టి పెట్టాలి. ప్రస్తుతం తను ఆనంద్ దేవరకొండ కాంబోలో సితార ఎంటర్ టైన్మెంట్స్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ తో పేరు తెచ్చుకున్న ఆదిత్య హాసన్ దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. జాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత మాట్లాడుతూ వైష్ణవి చైతన్యని బ్యాడ్ గా చూపించామని కూడా హింట్ ఇచ్చారు. మరి దీంతో ఏదైనా పెద్ద బ్రేక్ దక్కుతుందేమో చూడాలి. బేబీ జంట కలయిక రిపీట్ అవుతోంది కాబట్టి అంచనాలైతే ఉంటాయి మరి.