రెండు దశాబ్దాల కెరీర్ అయిపోయినా ఇంకా హీరోయిన్ గా చెలామణి అవుతున్న అతికొద్ది మందిలో త్రిష స్థానం మొదటిదని చెప్పాలి. సీనియర్ స్టార్లు ఇప్పటికీ తననే బెస్ట్ ఛాయస్ గా ఫీలవుతున్నారు. ముఖ్యంగా పొన్నియిన్ సెల్వన్, బీస్ట్ వచ్చాక త్రిష ఒక బెస్ట్ ఆప్షన్ గా మారిపోయింది. అయితే ఈ మధ్యకాలంలో ఈ అమ్మడి పాత్రలు అంతగా వర్కౌట్ కావడం లేదు. అజిత్ విడాముయార్చితో పాటు రీసెంట్ గుడ్ బ్యాడ్ అగ్లీలోనూ తన క్యారెక్టర్ల మీద కామెంట్స్ వచ్చాయి. పెద్దగా ప్రాధాన్యం లేకుండా హీరో భార్యగా నటించడం ఏమిటంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇతర సున్నితమైన వ్యక్తిగత విషయాల మీద బురద జల్లారు.
దీంతో కోపం వచ్చిన త్రిష ఇన్స్ టా స్టేటస్ లో సందేశం పెట్టింది. “విషపూరితమైన మనసు ఉన్నవాళ్లకు అసలు నిద్ర ఎలా పడుతుందో అర్థం కావడం లేదు. వీళ్ళ జీవితం ఎలా గడుస్తుందో తెలియట్లేదు. సోషల్ మీడియాలో కూర్చుని ఇతరుల గురించి అర్థం పర్థం లేని స్టఫ్ ని పంచుకుంటే మీకు రోజు గడుస్తుందా. ఇలాంటి పిరికివాళ్ళు చుట్టూ ఉన్నందుకు జాలేస్తుంది. మీకు దేవుడి దీవెనలు సదా ఉండు గాక”. చూశారుగా త్రిషకు గట్టిగానే ఆగ్రహం కలిగింది. నిజానికి ఇవన్నీ ఆన్ లైన్లో మాములు వ్యవహారాలే అయినా కొందరు హద్దుమీరి వివాదాలు చేసేందుకు ప్రయత్నించడంతో త్రిష తీవ్రంగా స్పందించింది
దీని సంగతలా ఉంచితే 2025 త్రిషకు దివ్యంగా ఉంది. మూడు నెలలు గడవడం ఆలస్యం రెండు సినిమాలు రిలీజయ్యాయి. తర్వాతి వరసలో చిరంజీవి విశ్వంభర, కమల్ హాసన్ తగ్ లైఫ్, మోహన్ లాల్ రామ్, సూర్య 45 ఉన్నాయి. వీటిలో మూడు దాదాపుగా పూర్తయిపోయాయి. మిగిలినవి కూడా వేసవిలోగా గుమ్మడికాయ కొట్టేస్తాయి. సినిమాల్లో ఇంత బిజీగా ఉన్నా బృంద లాంటి వెబ్ సిరీస్ లు అవకాశం దొరికినప్పుడు చేస్తున్న త్రిష నాలుగు పదుల వయసులోనూ పెళ్లి గురించి మాట్లాడ్డం లేదు. ఆఫర్లు ఇన్నేసి వస్తుంటే తను మాత్రం ఏం చేయగలదు. త్వరలో ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ ప్యాన్ ఇండియా మూవీ చేయనుందని చెన్నై టాక్.