బాహుబలి తర్వాత తనకు ఎంతటి ఇమేజ్ వస్తుందనేది ప్రభాస్ ముందే అంచనా వేయలేకపోయాడు. ఒకవేళ వేసినట్టయితే ఖచ్చితంగా తన తదుపరి రెండు చిత్రాలను అనుభవం లేని యువ దర్శకులతో ప్లాన్ చేసుకుని వుండేవాడు కాదు. బాహుబలి హిట్టయ్యాక తన మాట మార్చుకుని వుండొచ్చు కానీ తనకోసం అంతకాలం ఎదురు చూసిన దర్శకులను చిన్నబుచ్చలేక ఆ మాటకు కట్టుబడిపోయాడు.
సాహోతో సుజీత్ చాలా తడబడ్డాడు. ప్రభాస్‌కి వున్న శిఖరమంతటి ఇమేజ్‌కి తగ్గ సినిమా తీయలేక చతికిలపడ్డాడు. అతనితో పాటే రాధాకృష్ణ కుమార్‌కి కూడా మాట ఇచ్చిన ప్రభాస్ ఇంకా ‘రాధే శ్యామ్’ పూర్తి చేయలేకపోయాడు. కరోనా బ్రేక్ తర్వాత షూటింగ్ సజావుగా సాగుతుందని అనుకుంటే మళ్లీ బ్రేక్ పడింది. ఇప్పుడు విదేశాల్లో షూటింగ్ చేయలేని పరిస్థితి వుండడంతో ఈ చిత్రాన్ని ముందుకెలా తీసుకెళ్లాలా అని నిర్మాతలు వర్రీ అవుతున్నారు.
ఎక్స్టీరియర్ షాట్స్ అన్నీ తీసేసుకుని వచ్చి మిగతాది ఇక్కడే సెట్స్‌లో చేద్దామని అనుకున్నారు కానీ అంతవరకు కూడా షూట్ చేయలేకపోయారు. బాహుబలి తర్వాత ఇద్దరు యువ దర్శకులతో సినిమాలు చేయాలనే ప్రభాస్ నిర్ణయం ఇప్పుడు తన ఫ్యూచర్ ప్లాన్స్ ని కూడా ఎఫెక్ట్ చేస్తోంది. రాధేశ్యామ్ ఆలస్యం అయ్యేకొద్దీ ఆది పురుష్తో పాటు నాగ్ అశ్విన్ సినిమా కూడా మరింత వెనక్కి వెళుతుంది.