ఎవరైనా సంగీత దర్శకుడికి పేరొచ్చేది అతనిచ్చే మొదటి ఆల్బమ్ ని బట్టే. అది హిట్టయ్యిందా అవకాశాలు క్యూ కడతాయి. లేదూ ఫ్లాప్ అయినా పాటలు బాగున్నాయని పేరొచ్చినా ఆఫర్లు పట్టొచ్చు. కానీ అసలు తెరంగేట్రమే జరగకుండా పట్టుమని పాతికేళ్ళు లేని ఒక కుర్రాడు అనిరుధ్ రవిచందర్ రేంజ్ లో డిమాండ్ తెచ్చుకోవడం మాములు విషయం కాదు. సాయి అభ్యంకర్ అనే పేరు ఇప్పుడు ప్యాన్ ఇండియా దర్శకుల్లో మారుమ్రోగిపోతోంది. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీకి ఇతనే పని చేయబోతున్నాడనే వార్త మ్యూజిక్ లవర్స్ మధ్య హాట్ టాపిక్ గా మారింది.
దీనికన్నా ముందు ఏఆర్ రెహమాన్ వదులుకున్న సూర్య 45 ఛాన్స్ ఇతనే కొట్టేశాడు. లోకేష్ కనగరాజ్ కథతో లారెన్స్ హీరోగా రూపొందుతున్న బెంజ్ ఇతని ఖాతాలోనే ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రదీప్ రంగనాధన్ 4 సైతం సాయి అభ్యంకర్ జేబులోకే వచ్చిందని చెన్నై టాక్. ఇవి కాకుండా శింబు 49వ సినిమాకు సైతం ఇతన్నేఅడుగుతున్నారని, దాదాపు కన్ఫర్మని కోలీవుడ్ రిపోర్ట్. ఇంకో రెండు మూడు పెద్ద సినిమాలు ప్రతిపాదన దశలో ఉన్నాయి కానీ ఒకేసారి ఇన్ని ప్రాజెక్టులు హ్యాండిల్ చేయగలనో లేదో అనే అనుమానంతో సాయి అభ్యంకరే వాటిని పెండింగ్ లో ఉంచాడని తెలిసింది.
ఇంతగా ఇతనికి పేరు రావడానికి కారణం మ్యూజిక్ ఆల్బమ్సే. యూట్యూబ్ వేదికగా అతను చేసిన కంపోజింగ్స్ యూత్ ని విపరీతంగా ఆకట్టుకుని వందల మిలియన్ల వ్యూస్ తెచ్చుకున్నాయి. ఈ ఏడాది 21 వయసులో అడుగుపెట్టబోతున్న ఈ కుర్రాడికి ఇంత ప్రతిభ ఎక్కడిదయ్యా అంటే తల్లి తండ్రులు టిప్పు, హరిణి ఒకప్పుడు టాప్ సింగర్స్ కాబట్టి. తమిళం, తెలుగులో వీళ్ళు చాలా పాటలు పాడారు. ముఖ్యంగా 2000 నుంచి 2010 మధ్య సంగీత ప్రియులకు వీళ్ళ పరిచయం అక్కర్లేదు. వారసత్వంగా వచ్చింది కనకే సాయి అభ్యంకర్ కు ఈ టాలెంట్ ఉండటంలో ఆశ్చర్యం లేదనిపిస్తోంది కదూ. దాన్ని నిలబెట్టుకోవడం కీలకం.