విజయ్ చేజారింది బన్నీ చేతికొచ్చిందా?

రాజా రాణి లాంటి లవ్ స్టోరీతో దర్శకుడిగా పరిచయమైన అట్లీకి కమర్షియల్ డైరెక్టర్ గా పెద్ద బ్రేక్ ఇచ్చింది విజయే. వీళ్ళ కాంబినేషన్ లో మూడు హ్యాట్రిక్ సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్ బస్టర్ కావడం కోలీవుడ్ చరిత్రలో అలా నిలిచిపోయింది. తేరి (పోలీసోడు), మెర్సల్ (అదిరింది), బిగిల్ (విజిల్) తెలుగులోనూ అంతే విజయాన్ని సాధించాయి. ఇదంతా 2016 నుంచి 2019 మధ్య జరిగిన స్టోరీ. ఆ తర్వాత వీళ్ళ కలయికలో ఒక ప్యాన్ ఇండియా మూవీ తీసేందుకు సన్ పిక్చర్స్ సన్నాహాల్లో ఉన్నట్టు 2022 కోలీవుడ్ వర్గాల్లో కథనాలు వచ్చాయి. రెమ్యునరేషన్లకే రెండు వందల కోట్ల దాకా పెడుతున్నట్టు మీడియాలో తిరిగింది.

ఒక ఏడాది వరకు దీని గురించి అభిమానుల చర్చలు, అంచనాలు జరిగాయి. కట్ చేస్తే అట్లీకి షారుఖ్ ఖాన్ నుంచి పిలుపు రావడం, జవాన్ ఓకే అయిపోయి ఆఘమేఘాల మీద షూటింగ్ కానివ్వడం, ఆపై రిలీజ్, అటుపై బ్లాక్ బస్టర్ పడిపోయాయి. దీంతో విజయ్ 68 కాస్తా గోట్ గా మారి వెంకట్ ప్రభు చేతికెళ్లింది. అయితే అప్పటికే సన్ నుంచి అడ్వాన్స్ పుచ్చుకున్న అట్లీ దాన్ని వేరే స్టార్ హీరోతో అయినా సరే నెరవేరుస్తానని హామీ ఇవ్వడంతో, అటుఇటు తిరిగి చివరికి ఇంత పెద్ద కాన్వాస్ ని తట్టుకునే హీరో అల్లు అర్జున్ మాత్రమేనని భావించి ఆ మేరకు ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామాకు ఒప్పించినట్టు తెరవెనుక వినిపిస్తున్నప్రచారాల సారాంశం.

సల్మాన్ ఖాన్ కు చెప్పింది ఈ సబ్జెక్టేనా లేక వేరొకటా అనే క్లారిటీ లేదు కానీ అంతర్గతంగా వినిపిస్తున్న దాని ప్రకారం ఇద్దరు హీరోలతో చేయాలనుకున్న అట్లీ దాన్నే డ్యూయల్ రోల్ గా మార్చి అల్లు అర్జున్ ఇమేజ్ కు తగ్గట్టు పవర్ ఫుల్ గా డిజైన్ చేశాడని చెబుతున్నారు. సన్ పిక్చర్స్ ఇప్పటిదాకా తమిళం కాకుండా ఇతర బాషా హీరోలతో సినిమాలు చేయలేదు. మొదటిసారి అల్లు అర్జున్ కోసం తన పంథా మార్చుకుంది. ఇదంతా పుష్ప వల్లేనని వేరే చెప్పనక్కర్లేదు. విజయ్ ఎలాగూ రాజకీయంగా కొత్త మార్గం ఎంచుకున్నాడు కాబట్టి బన్నీతో తప్ప ఇంకెవరితోనూ అంత బడ్జెట్ వర్కౌట్ కాదనే నమ్మకం కాబోలు ఇలాంటి నిర్ణయం తీసుకుంది.