కోలీవుడ్ దర్శకులతో మన హీరోలు సినిమాలు చేయడం కొత్తేమి కాదు కానీ ఇటీవలె కొన్ని ఫలితాలు ఆందోళన కలిగించేలా రావడం ఈ టాపిక్ మీద ఫోకస్ తెప్పిస్తోంది. తమిళ డైరెక్టర్లను గుడ్డిగా నమ్మడం వల్ల రామ్ చరణ్ (గేమ్ ఛేంజర్), నాగ చైతన్య (కస్టడీ), రామ్ (ది వారియర్), మహేష్ బాబు (స్పైడర్) తదితరులు డిజాస్టర్లు అందుకున్నారు. అలాని అందరికీ అలా జరుగుతుందని కాదు. ఒకప్పుడు చిరంజీవికి మాస్టర్, వెంకటేష్ కు వసంతం, పవన్ కళ్యాణ్ కు తొలిప్రేమ ఇచ్చింది వాళ్లే. ఇప్పుడు మళ్ళీ ఈ ట్రెండ్ ఊపందుకుంది. అట్లీకి అల్లు అర్జున్ కలయిక జరగడం, అది వందల కోట్ల బడ్జెట్ డిమాండ్ చేసే స్కైఫై జానర్ కావడం ఇవాళ చూశాం.
త్వరలో జూనియర్ ఎన్టీఆర్ జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ తో చేతులు కలపబోతున్నాడు. ఇటీవలే ఒక ఈవెంట్ లో తారక్ చూచాయగా చెప్పింది ఈ కాంబో గురించే. లోకేష్ కనగరాజ్ భవిష్యత్తులో ప్రభాస్, చరణ్ తో వేర్వేరుగా రెండు భారీ చిత్రాలు చేయొచ్చని చెన్నై వర్గాల కథనం. అయితే పాత ఉదాహరణలు చూస్తే బడ్జెట్ పరంగా పెద్ద రిస్క్ లేనివి. కానీ ఇప్పుడలా కాదు. టయర్ 1 హీరోల బడ్జెట్ కనీసం రెండు వందల కోట్లకు పైనే ఉంటోంది. ఇంత మొత్తం రిస్క్ చేస్తున్న నిర్మాతలు కాంబో కన్నా ఎక్కువ కంటెంట్ నమ్మి పెట్టుబడులు కుమ్మరిస్తున్నారు. ఏ మాత్రం తేడా కొట్టినా అప్పుడు పడే దెబ్బ మాములుగా ఉండదు.
ఓ సందర్భంలో దగ్గుబాటి రానా అన్నట్టు ఇప్పుడు సౌత్ ఇండియా నార్త్ ఇండియా అంటూ ఏమి లేదు. అన్నీ ఇండియన్ మూవీసే. బాగున్నవి రాష్ట్రాలతో సంబంధం లేకుండా ఆడతాయి. హిందీలో అడుగే పెట్టని సుకుమార్ పుష్ప 2తో జాతీయ రికార్డులు కొల్లగొట్టేశారు. రాజమౌళికి జపాన్ వాళ్ళు సైతం బ్రహ్మరథం పట్టారు. హిట్లు లేక మొహం వాచిపోయిన షారుఖ్ ఖాన్ కి జవాన్ ఇచ్చింది, యానిమల్ తో రన్బీర్ కపూర్ రేంజ్ పెంచింది మన సౌత్ దర్శకులే. సో మెప్పించే సత్తా, స్టోరీలో దమ్ము ఉండాలే కానీ ఎవరు ఎవరితో చేసినా ప్రేక్షకులు వసూళ్ల వర్షం కురిపిస్తారు. ఫ్యూచర్ లో ఇంకా సర్ప్రైజింగ్ కలయికలు ఎన్నో జరగబోతున్నాయి.