“ఆమె నటిస్తేనే సినిమా… లేదంటే లేదు”

కొన్ని పాత్రల విషయంలో మేకర్స్ చాలా పర్టికులర్‌గా ఉంటారు. ఒక పాత్రను ఫలానా వాళ్లు చేస్తేనే సినిమా చేయాలని లేదంటే లేదని పట్టుబట్టి కూర్చుంటారు. ఇలా పట్టుదలకు పోయి ఆగిపోయిన సినిమాలు కూడా ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ-కృష్ణవంశీ కలయికలో రావాల్సిన ‘రైతు’ సినమాను ఇలాగే ఆపేశారు. అమితాబ్ బచ్చన్‌ను ఓ ముఖ్య పాత్రలో నటింపజేయడానికి ఆయనతో సంప్రదింపులు జరిపింది ఈ జోడీ. కానీ అమితాబ్ ఆ పాత్ర చేయలేకపోవడంతో సినిమానే ఆపేశారు.

వర్తమానంలోకి వస్తే.. నందమూరి కళ్యాణ్ రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమా విషయంలో కూడా ఇలాంటి కండిషనే పెట్టాడట. ఇందులో విజయశాంతి.. కళ్యాణ్ రామ్ తల్లి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఐతే తన తల్లిగా వైజయంతి అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కళ్యాణ్ రామ్.. విజయశాంతి తప్ప మరొకరిని ఊహించుకోలేకపోయాడట. ఆమె ఈ పాత్ర చేస్తేనే సినిమా ఉంటుందని.. లేదంటే లేదని తేల్చేశాడట. ఇదే విషయంలో దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తన దగ్గర చెప్పినట్లు విజయశాంతి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

మీరు సినిమా చేయండి లేదంటే తన కెరీర్ పోతుంది అంటూ అతను వేడుకున్నట్లు విజయశాంతి తెలిపారు. ఐతే అతను అలా చెప్పాడని కాకుండా, తన పాత్ర ఎంతో నచ్చి ఈ సినిమా చేసినట్లు విజయశాంతి వెల్లడించారు. తన కమ్ బ్యాక్‌కు ఇది సరైన పాత్ర, సినిమా అని ఆమె అభిప్రాయపడ్డారు. తల్లీ కొడుకుల పాత్రలే అయినప్పటికీ.. వక్రమార్గంలో వెళ్తున్న కొడుకుతో ఢీకొట్టే పాత్ర కావడం, అదే సినిమాలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ కావడం ఈ సినిమాలో ప్రత్యేకత. కళ్యాణ్ రామ్ సరసన సయీ మంజ్రేకర్ నటించిన ఈ చిత్రం.. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.