సమయం దగ్గర పడుతోంది వీరమల్లూ

వాయిదాల పర్వంలో మునిగి తేలుతున్న హరిహర వీరమల్లు మే 9 విడుదల కావడం ఖరారేనని యూనిట్ వర్గాలు అంటున్నా ప్రమోషన్లు పూర్తి స్థాయిలో మొదలుకాకపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే పోస్ట్ పోన్ల వల్ల ఈ ప్యాన్ ఇండియా మూవీకి ఆశించిన బజ్ లేదు. పోస్టర్లు, పాటలు అంత ఎగ్జైట్ మెంట్ ఇవ్వలేకపోయాయి. నిన్న పెద్ది గ్లిమ్ప్స్ చూపించిన ప్రభావం లాంటిది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు కానీ అలాంటి సూచనేమి నిర్మాత వైపు నుంచి కనిపించడం లేదు. ఇంకొక్క నాలుగైదు రోజులు పవన్  డేట్లు ఇస్తే మొత్తం షూటింగ్ అయిపోతుందనే లీక్ తప్ప ఎలాంటి సమాచారం రాలేదు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అరకు పర్యటనలో ఉన్నారు. వచ్చే వారం అమరావతిలో ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమంలో బిజీ అవుతారు. మధ్యలో మంత్రివర్గ సమావేశాలు, జనసేన సమీక్షలు ఉండనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కాల్ షీట్లు ఇవ్వడం అంత సులభంగా లేదు. ఇంకా డబ్బింగ్ జరగాలి. సెన్సార్ కు వెళ్ళాలి. టైం చూస్తే నెల రోజులు మాత్రమే బ్యాలన్స్ ఉంది. ఈలోగా ఈవెంట్లు, పబ్లిసిటీ అన్నీ చేసుకోవాలి. అన్ని భాషల్లో రిలీజ్ కాబట్టి ముంబై, చెన్నై, బెంగళూరు లాంటి నగరాలకు తిరగాలి. పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం తక్కువ కాబట్టి మిగిలిన క్యాస్టింగ్ తో బజ్ పెంచడం సులభం కాదు.

ఒకవేళ మళ్ళీ వాయిదా అంటే ఇబ్బందులు తప్పవు. వీలైనంత త్వరగా జనం దృష్టిలో హరిహర వీరమల్లు పడేలా ప్రచార పర్వానికి తెరతీయాలి. ఎంత పవన్ కళ్యాణ్ సినిమా అయినా సరే స్వంత అభిమానుల్లోనే దీని పట్ల సానుకూలత కనిపించనప్పుడు బయటి ఆడియన్స్ లో ఆసక్తి రేగడం కష్టం. ముందు ఈ గ్యాప్ సరిచేయాలి. అది పవన్ కళ్యాణ్ దిగితే అవుతుందని చెప్పడం లేదు. సరైన ట్రైలర్, మీడియాతో ముఖాముఖీలు, రెండు మూడు ఈవెంట్లతో పని కానివ్వొచ్చు. ఎటొచ్చి దర్శకుడు జ్యోతికృష్ణతో సహా టీమ్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీ ఉంది. అడుగుదామా అంటే నిర్మాత దొరకట్లేదు. చూడాలి ఏం జరుగుతుందో.