నానికి మరో జాక్ పాట్

కొన్నేళ్లుగా టాలీవుడ్లో నేచురల్ స్టార్ నాని ఊపు మామూలుగా లేదు. ఇటు హీరోగా వరుస హిట్లు కొడుతున్నాడు. అటు నిర్మాతగానూ దూసుకెళ్తున్నాడు. నాని ప్రొడక్షన్లో వచ్చిన హిట్, హిట్-2, కోర్ట్.. ఒకదాన్ని మించి ఒకటి హిట్టయ్యాయి. నానికి పేరుతో పాటు డబ్బులూ తెచ్చిపెట్టాయి. ఇక హీరోగా దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టాడు నాని.

గత నెలలో వచ్చిన నాని ప్రొడక్షన్ మూవీ ‘కోర్ట్’ అయితే పెట్టుబడి మీద రెండు రెట్ల లాభం అందించింది. ఇప్పుడు నానికి ఇంకో జాక్ పాట్ తగిలినట్లు సమాచారం. తనే హీరోగా నటిస్తూ సొంత ప్రొడక్షన్లో నాని ‘హిట్-3’ మూవీ చేసిన సంగతి తెలిసిందే. హిట్ సిరీస్‌లో మూడో చిత్రమిది. శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు.

‘హిట్-3’ మొదలైనప్పుడే బంపర్ క్రేజ్ వచ్చింది. దీని టీజర్ వచ్చాక హైప్ వేరే లెవెల్‌కు వెళ్లింది. ఇంకో నాలుగు వారాల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈలోపే ఈ సినిమాకు బిజినెస్ మొత్తం పూర్తయినట్లు సమాచారం. డిజిటల్ రైట్స్‌ను నెల ముందే నెట్‌ఫ్లిక్స్ వాళ్లకు అమ్మేశాడు నాని. ఏకంగా రూ.54 కోట్ల రేటు పలికింది. ఇక సినిమాకు థియేట్రికల్ బిజినెస్ కూడా గట్టిగానే జరుగుతోందట. ఇంకా ఆడియో, శాటిలైట్, హిందీ డబ్బింగ్.. లాంటి నాన్ థియేట్రికల్ రైట్స్ ఉండనే ఉన్నాయి. మొత్తంగా ఈ సినిమా మీద నాని రూ.35-40 కోట్ల లాభం అందుకోనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు రూ.60 కోట్ల దాకా ఖర్చయినట్లు సమాచారం.

నాన్ థియేట్రికల్ రైట్స్‌తోనే బడ్జెట్ మీద కొంత లాభం రాగా.. థియేటర్ల నుంచి వచ్చేదంతా లాభమే. పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లు నిర్మించే పెద్ద సినిమాలకు కూడా ఈ స్థాయిలో లాభాలు రావడం అరుదు. మొత్తానికి నాని టైం ప్రస్తుతం మామూలుగా లేదని ఇండస్ట్రీ జనాలు చర్చించుకుంటున్నారు.