వావ్.. తెలుగమ్మాయికి బాలీవుడ్ ఛాన్స్

తెలుగమ్మాయిలకు తెలుగులో ఆశించిన అవకాశాలు రావు కానీ.. వాళ్లు వేరే భాషల్లోకి వెళ్లి సత్తా చాటుతుంటారు. అంజలి, ఆనంది, శ్రీదివ్య, కలర్స్ స్వాతి లాంటి వాళ్లు తమిళంలో ఎంత మంచి పేరు సంపాదించారో తెలిసిందే. ఐతే తెలుగుమ్మాయిలు ఎక్కువగా తమిళంలోకే వెళ్తుంటారు కానీ.. హిందీలో అవకాశాలు అందుకోవడం మాత్రం అరుదే.

ముందు తరంలో జయప్రద, శ్రీదేవి లాంటి వాళ్లు ఇందుకు మినహాయింపు. తర్వాతి తరంలో హిందీలో ఛాన్సులు సంపాదించిన వాళ్లు కనిపించరు. ఐతే ఇప్పుడు అనన్య నాగళ్ళ బాలీవుడ్ ఛాన్స్ అందుకోవడం విశేషం. తెలుగులో ఎక్కువగా చిన్న సినిమాలే చేసిన ఈ అమ్మాయికి ఇప్పుడు బాలీవుడ్ మూవీలో అవకాశం అందుకున్నట్లు సమాచారం.

బాలీవుడ్ పేరున్న నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఏక్తా ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో అనన్య తొలి హిందీ చిత్రం చేస్తుండడం విశేషం. పైగా ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ అట. రాకేశ్ జగ్గి అనే దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే 50 శాతం పైగా చిత్రీకరణ కూడా పూర్తి చేసుకుంది. ఇందులో అనన్య గిరిజన యువతిగా పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్ర చేస్తోందట.

అనన్య తెలుగులో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో రాణిస్తూనే.. తనలోని గ్లామర్ కోణాన్ని కూడా చూపించింది. మల్లేశం, ప్లే బ్యాక్ లాంటి చిత్రాలు ఆమెకు నటిగా మంచి పేరే తెచ్చిపెట్టాయి. ఐతే అవకాశాలకు లోటు లేకపోయినా.. ఆమె చేస్తున్నవి చిన్న సినిమాలు కావడంతో ఒక స్థాయికి మించి ఎదగలేకపోతోంది. ఇలాంటి టైంలో బాలీవుడ్ ఛాన్స్ తన కెరీర్‌ను మలుపు తిప్పుతుందేమో చూాడాలి.