ప్రస్తుతం బాలీవుడ్ స్టార్లు ఒక్కొక్కరుగా సౌత్ డైరెక్టర్ల వైపు చూస్తున్నారు. ముఖ్యంగా తెలుగు దర్శకులకు అక్కడ మాంచి డిమాండ్ ఏర్పడింది. ఓవైపు తెలుగు దర్శకులు రూపొందించిన చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో అదరగొడుతుంటే.. మరోవైపు సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకులు బాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుండడమే ఈ డిమాండుకు కారణం.
ఇంకొన్ని రోజుల్లోనే గోపీచంద్ మలినేని రూపొందించిన తొలి బాలీవుడ్ మూవీ ‘జాట్’ ప్రేక్షకులను పలకరించబోతోంది. తన బాటలోనే మరో తెలుగు దర్శకుడు హిందీలో ఓ భారీ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నట్లు తాజా సమాచారం. ‘వాల్తేరు వీరయ్య’, ‘డాకు మహారాజ్’ చిత్రాలతో హిట్లు కొట్టిన బాబీ.. అతి త్వరలో బాలీవుడ్ అరంగేట్రం చేయబోతున్నట్లు తెలిసింది.
‘డాకు మహారాజ్’ తర్వాత బాబీ కొంచెం గ్యాప్ తీసుకుని.. బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన హృతిక్ రోషన్‌ను కలిశాడు. బాబీ చెప్పిన కథకు ప్రాథమికంగా అంగీకారం తెలిపాడట హృతిక్. ఇంకా పూర్తి స్క్రిప్టు చెప్పాల్సి ఉంది. స్టోరీ లైన్ మాత్రం హృతిక్‌కు నచ్చింది. సినిమా చేయడానికి ఓకే అన్నాడట. ఇక పూర్తి స్క్రిప్టు చేసుకుని వెళ్లి మళ్లీ హృతిక్‌ను కలవబోతున్నాడు బాబీ. హృతిక్ రెండోసారి కూడా ఓకే చెబితే.. ఈ సినిమా పట్టాలెక్కినట్లే.
తమ బేనర్లో ‘వీరసింహారెడ్డి’ చేశాక గోపీచంద్‌ను ‘జాట్’తో బాలీవుడ్‌కు పరిచయం చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లే.. ‘వాల్తేరు వీరయ్య’తో తమకు సక్సెస్ అందించిన బాబీతో బాలీవుడ్ మూవీ చేసే అవకాశముంది. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన బాబీ.. హృతిక్‌తో కూడా తన మార్కు సినిమానే తీసే అవకాశముంది.