శంకర్.. ఇప్పుడేం చేయబోతున్నాడు?

ఒకప్పుడు సౌత్ ఫిలిం ఇండస్ట్రీని ఏలిన లెజెండరీ డైరెక్టర్ శంకర్.. కొన్నేళ్లుగా ఎంత తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారో తెలిసిందే. ఐ, ఇండియన్-2 లాంటి డిజాస్టర్లు ఆయన్ని కిందికి లాగేశాయి. ‘2.0’ మంచి ఓపెనింగ్సే సాధించినా.. అది కూడా నిర్మాతలకు నష్టాలే మిగిల్చింది. ఈ స్థితిలో ‘గేమ్ చేంజర్’ మీదే ఆయన ఆశలన్నీ నిలిచాయి. కానీ అది కూడా నిరాశనే మిగిల్చింది. ‘ఇండియన్-2’తో పోలిస్తే ఇది బెటర్ అన్న టాక్ వచ్చింది తప్ప.. సినిమా ఆడలేదు. మరోవైపు ఇప్పటికే చాలా వరకు పూర్తి చేసి.. ఓ 30 శాతం షూట్ పెండింగ్‌లో ఉన్న ‘ఇండియన్-3’ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.

‘గేమ్ చేంజర్’ విడుదలకు ముందు దీని మీద నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు, శంకర్‌కు మధ్య వివాదం కూడా నడిచింది. ఆ సినిమాను మధ్యలో వదిలేయడంపై ఆ సంస్థ శంకర్ మీద ఫిర్యాదు చేసింది. ఐతే ‘గేమ్ చేంజర్’ రిలీజ్ తర్వాత చూద్దామని ఆ గొడవను సర్దుబాటు చేసుకున్నాడు శంకర్. ఇప్పుడు చూస్తే ‘గేమ్ చేంజర్’ కూడా డిజాస్టర్ అయింది. మరోవైపు లైకా సంస్థ దివాళా దశకు వచ్చింది. వరుసగా వాళ్ల సినిమాలు భారీ నష్టాలు మిగల్చడంతో నిర్మాణమే ఆపేసే స్థితికి వచ్చింది లైకా. ‘ఇండియన్-3’ మీద ప్రేక్షకులకు ఏమాత్రం ఆశలూ లేవు. దానికి బిజినెస్ జరిగే పరిస్థితీ లేదు. అలా అని ఆల్రెడీ వందల కోట్లు ఖర్చు పెట్టిన సినిమాను అలా వదిలేయలేరు. అందుకే లైకా ప్రతినిధులు, శంకర్ ఒక అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది.

పరిమిత బడ్జెట్లో మిగతా 30 శాతం చిత్రీకరణ పూర్తి చేసి సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఇందుకోసం కమల్ నుంచి నెల రోజుల కాల్ షీట్స్ కూడా అడుగుతున్నారట. ఎవ్వరికీ సినిమా మీద ఆశలు లేకపోయినా.. పూర్తి చేసి రిలీజ్ చేస్తే ఎంతో కొంత ఆదాయం వచ్చి నష్టాలు రికవర్ అవుతాయని భావిస్తున్నారు. శంకర్ కొత్త ప్రాజెక్టు ఏదీ ఎంచుకోకుండా ఇండియన్-3ని పూర్తి చేయడమే పనిగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.