నవీన్ పోలిశెట్టి సినిమాకు త్రివిక్రమ్ చేయూత

ఇప్పుడున్న యూత్ హీరోల్లో తనదైన టైమింగ్ తో ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో నవీన్ పోలిశెట్టి. కాకపోతే ప్రతి సినిమాకి ఎక్కువ గ్యాప్ ఉంటుందనే కంప్లయింట్ అభిమానుల నుంచి ఉన్నప్పటికీ క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యమని పాటించే తన నుంచి ఎక్కువ వేగం ఆశించలేం. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత నవీన్ చేస్తున్న మూవీ అనగనగా ఒక రోజు. మారి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందిస్తున్నారు. మూడు నెలల క్రితం వచ్చిన అనౌన్స్ మెంట్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే మ్యాడ్ దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ప్రకారం దీని వెనుక పెద్ద కథే ఉంది.

జాతిరత్నాలు బ్లాక్ బస్టరయ్యాక నవీన్ పోలిశెట్టికి డైరెక్టర్ గా డెబ్యూ చేసే ప్రయత్నాల్లో ఉన్న ఉన్న కళ్యాణ్ శంకర్ చెప్పిన కథ అనగనగా ఒక రాజు. సెకండాఫ్ కు సంబంధించి కొన్ని కరెక్షన్లు అవసరమై అనుకున్న సమయానికి సెట్స్ పైకి వెళ్లలేకపోయింది. ఈలోగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మొదలైపోయింది. రెండూ ఒకేసారి జరగడంలోని ఇబ్బందులు గుర్తించిన కళ్యాణ్ శంకర్ ఇంకోవైపు మ్యాడ్ సిద్ధం చేసుకోవడం, అది నాగవంశీకి వినిపించి, ఆయనకు నచ్చేసి గ్రీన్ సిగ్నల్ వచ్చి చకచకా పూర్తయిపోవడం జరిగింది. అలా మూడేళ్ళ కాలం గడిచిపోయినా అనగనగా ఒక రాజు మీదున్న నవీన్ నమ్మకం ఆ సబ్జెక్టుని వదలకుండా చేసింది.

దీంతో ఆలస్యమైనా సరే మారితో శ్రీకారం చుట్టారు. కళ్యాణ్ శంకర్ స్క్రిప్ట్ తయారు చేస్తున్న దశలో ఒక రోజు మొత్తం దీనికి కేటాయించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కొన్ని కీలక మార్పులు, సలహాలు సూచనలు అందివ్వడంతో మరింత మెరుగ్గా తయారయ్యేందుకు ఉపయోగపడింది. ఇప్పుడు తీస్తున్న వెర్షన్ లోనూ అవి ఉండబోతున్నాయి. సో నవీన్ తో కలిపి మొత్తం నలుగురు క్రియేటర్స్ ఇందులో భాగమయ్యారన్న మాట. అంతర్గతంగా వినిపిస్తున్న టాక్ ప్రకారం అనగనగా ఒక రోజు 2026 సంక్రాంతి విడుదలకు ప్లాన్ చేస్తున్నారట. ఇంకా అనౌన్స్ మెంట్ రాలేదు కానీ సితార టీమ్ చెబుతున్న దాని ప్రకారమైతే పండగ బరిలో ఉన్నట్టే.