మాస్ రాజా ‘జాతర’ ఎప్పుడంటే?

మాస్ రాజా రవితేజకు ఇప్పుడు అత్యవసరంగా ఒక పెద్ద హిట్ అవసరం. గత ఏడాది ఆయన్నుంచి వచ్చిన ‘ఈగల్’, ‘మిస్టర్ బచ్చన్’ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు అయ్యాయి. తన ఇమేజ్‌ నుంచి కొంచెం పక్కకు వెళ్లిన ఆ చిత్రాలు నిరాశపరచడంతో రవితేజ మళ్లీ తన మార్కు సినిమా చేస్తున్నాడు.

‘సామజవరగమన’ రైటర్లలో ఒకడైన భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం.. మాస్ జాతర. రవితేజకు తగ్గ కథ, టైటిల్ సెట్ కావడంతో అభిమానులు ఎంతో ఎగ్జైట్ అవుతున్నారు. పైగా తనకు బాగా కలిసొచ్చిన పోలీస్ పాత్రను రవితేజ చేస్తున్నాడిందులో. ఈ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వేసవిలోనే రిలీజ్ అనుకున్నారు కానీ.. అలా సాధ్యపడట్లేదని తెలుస్తోంది.

‘మాస్ జాతర’ చిత్రాన్ని జులైలో రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ వెల్లడించాడు. ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్లో నాగవంశీ ఈ విషయాన్ని వెల్లడించాడు. వేసవిలో తమ బేనర్ నుంచి సూర్య అనువాద చిత్రం ‘రెట్రో’తో పాటు విజయ్ దేవరకొండ మూవీ ‘కింగ్‌డమ్’ వస్తాయని నాగవంశీ తెలిపాడు. దీని తర్వాత జులైలో ‘మాస్ జాతర’ను రిలీజ్ చేస్తామన్నాడు.

ఈ ఏడాది ఇంకో చిత్రం కూడా తమ బేనర్ నుంచి వస్తుందన్నాడు. బహుశా అది ‘అనగనగా ఒక రోజు’ కావచ్చు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఓ పెద్ద సినిమా.. అలాగే ఆ వేసవిలో రెండు చిత్రాలు తమ సంస్థ నుంచి వస్తాయన్నాడు. మరోవైపు ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయిపోయిన నేపథ్యంలో రేపట్నుంచి ఈ సినిమాకు టికెట్ల ధరలు తగ్గుతాయని.. సింగిల్ స్క్రీన్లలో 150, మల్టీప్లెక్సుల్లో రూ.200 రేట్లతో సినిమా నడుస్తుందని నాగవంశీ తెలిపాడు.