బన్నీ అట్లీ కాంబోలో పునర్జన్మల ట్విస్టు ?

టాలీవుడ్ లో పునర్జన్మలది సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డు. ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ కథతో వచ్చాయి. ఏఎన్ఆర్ మూగ మనసులు దానికి క్లాసిక్ ఉదాహరణ అనుకుంటే ఇప్పటి తరానికి మగధీర, మనం గురించి చెప్పొచ్చు. ఒక జంట చనిపోయాక కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ పుట్టి పూర్వ జన్మ తాలూకు జ్ఞాపకాలతో ముడిపడి ప్రయాణం చేయడమనే పాయింట్ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో మళ్ళీ ఎవరూ ఈ పాయింట్ టచ్ చేయలేదు. తాజాగా వినిపిస్తున్న లీక్ ప్రకారం అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ ఇండియా మూవీలో ఈ కాన్సెప్ట్ ఉండొచ్చని అంటున్నారు.

అల్లు అర్జున్ ఇందులో రెండు పాత్రల్లో కనిపిస్తాడనే టాక్ కొద్దిరోజుల క్రితం వినిపిస్తే అందరూ డ్యూయల్ రోల్ అనుకున్నారు. కానీ అది పునర్జన్మల గురించని లేటెస్ట్ అప్డేట్. అంటే ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు బన్నీలు కనిపించరు కానీ రెండు వేర్వేరు గెటప్స్ అయితే ఉంటయన్న మాట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో పీరియాడిక్ సెటప్ ఉంటుందని కాకపోతే మగధీరలా రాజులు, యుద్ధాలు కాదట. సగటు కమర్షియల్ బ్యాక్ డ్రాప్ లోనే అట్లీ మార్కు హీరోయిజం చూపిస్తూ డిఫరెంట్ గా రాసుకున్నారని తెలిసింది. ప్రస్తుతం ఫైనల్ వెర్షన్ స్క్రిప్ట్ కి మెరుగులు దిద్దుతున్నారు. అంతా ఓకే అయితే ఏప్రిల్ 8 బన్నీ పుట్టినరోజు ప్రకటన రానుంది.

పుష్ప 2 తర్వాత సినిమా కావడంతో ఐకాన్ స్టార్ ఏ విషయంలోనూ రాజీ పడటం లేదు. అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఎంత అట్లీ అయినా గుడ్డిగా నమ్మడానికి లేదు. ఇటీవలే ఆయన రచనలో బేబీ జాన్ ఎలాంటి ఫలితం అందుకుందో చూశాం. జవాన్ బ్లాక్ బస్టరే కానీ అందులో రొటీన్ కంటెంట్ మీద కామెంట్లు లేకపోలేదు. అయితే అట్లీ ఇవన్నీ పట్టించుకునే రకం కాదు. మాస్ ఆడియన్స్ ని ఊగిపోయేలా చేయడంలో ఇతని స్టయిలే వేరు. ఇప్పుడు కూడా అదే ఫాలో కావొచ్చు. బడ్జెట్ ఎంతనేది బయటికి చెప్పడం లేదు కానీ మూడు వందల కోట్ల పైమాటేనట. సన్ పిక్చర్స్, గీతా ఆర్ట్స్ సంయుక్త నిర్మాణంలో ఉండొచ్చని టాక్.