ప్ర‌భాస్ అలా అంటే క‌న్న‌ప్ప చేసేవాడిని కాదు- మంచు విష్ణు

మంచు కుటుంబానికి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన చిత్రం.. క‌న్న‌ప్ప‌. ఈ సినిమా గురించి ప‌దేళ్ల కింద‌ట్నుంచే మోహ‌న్ బాబు, విష్ణు చెబుతూ వ‌స్తున్నారు. ముందు త‌నికెళ్ల భ‌ర‌ణి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా చేయాల‌ని విష్ణు భావించాడు. కానీ త‌ర్వాత ఆయ‌న మూల క‌థ ఇచ్చి సైడైపోయారు. విష్ణునే త‌న రైటర్స్ టీంతో క‌లిసి ఈ స్క్రిప్టు డెవ‌ల‌ప్ చేశాడు. బాలీవుడ్‌కు చెందిన ముకేశ్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా చేశాడు. మోహ‌న్ బాబు వంద కోట్ల‌కు పైగా బ‌డ్జెట్లో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ఏప్రిల్ 25న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుద‌ల కాబోతోంది.

ఇందులో ప్ర‌భాస్ ప్ర‌త్యేక పాత్ర పోషించ‌డం మేజ‌ర్ హైలైట్ల‌లో ఒక‌టి. ఐతే ప్ర‌భాస్‌ను క‌న్న‌ప్ప పాత్ర‌లో చూడాల‌న్న‌ది త‌న పెద‌నాన్న కృష్ణంరాజు క‌ల‌. స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా చేయాల‌నుకున్నారు. ఒక‌ప్పుడు భ‌క్త క‌న్న‌ప్ప సినిమాతోనే కృష్ణంరాజు ఘ‌న‌విజ‌యాన్నందుకున్నారు. ఆయ‌న కెరీర్లో అదో మైలురాయిలా నిలిచింది. కానీ ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్ర‌లో క‌న్న‌ప్ప సినిమా తీయాల‌న్న క‌ల నెర‌వేర‌కుండానే కృష్ణంరాజు వెళ్లిపోయారు. కృష్ణంరాజు ఉండ‌గానే మంచు విష్ణు.. తాను క‌న్న‌ప్ప చేయ‌డానికి స‌న్నాహాలు చేసుకున్నాడు. ఐతే ప్ర‌భాస్ త‌నే లీడ్ రోల్‌లో ఈ సినిమా చేయాల‌ని అనుకుని ఉంటే తాను ఈ చిత్రం చేసేవాడిని కాద‌ని విష్ణు చెప్ప‌డం విశేషం.

ప్ర‌భాస్ ఒక్క మాట చెబితే తాను ఈ ప్రాజెక్టును ప‌క్క‌న పెట్టేసేవాడిన‌న్నారు. కృష్ణంరాజుకు భ‌క్త‌ క‌న్న‌ప్ప సినిమాతో ఉన్న అనుబంధం త‌న‌కు తెలుస‌ని.. త‌మ సినిమాకు ఆయ‌న ఆశీస్సులు త‌ప్ప‌కుండా ఉంటాయ‌ని ఆశిస్తున్నాన‌ని విష్ణ‌/ చెప్పాడు. ఇక ఈ సినిమాలో శివ లింగాన్ని చూపించిన తీరుపై విమ‌ర్శ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో విష్ణు స్పందించాడు. శ్రీకాళ‌హ‌స్తిలో ఉన్న శివ‌లింగం ఆకారాన్నే సినిమాలో చూపించామ‌ని.. నిజ‌మైన శివ‌లింగం ఇలాగే ఉంటుంద‌ని విష్ణు చెప్పాడు. ఎంతో రీసెర్చ్ చేశాక‌, కాళ‌హ‌స్తి ఆల‌య పూజారుల‌తో మాట్లాడి త‌మ ఆర్ట్ డైరెక్ట‌ర్ ఈ లింగాన్ని డిజైన్ చేసిన‌ట్లు విష్ణు తెలిపాడు.