ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక సినిమాలు చేసే విషయంలో తగినంత సమయం దొరక్క బ్యాలన్స్ ఉన్నవే వేగంగా పూర్తి చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ కారణంగానే హరిహర వీరమల్లు పార్ట్ 1 వాయిదాల మీద వాయిదాలు తీసుకుని ఆఖరికి మే 9 లాక్ చేసుకుంది. ఓజికి కూడా త్వరలో డేట్లు ఇస్తారనే వార్తల నేపథ్యంలో ఇది కూడా వేగంగా పూర్తవుతుందనే ఆశతో అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎటొచ్చి అందరికీ డౌట్ ఉన్నది ఒక్క ఉస్తాద్ భగత్ సింగ్ మీదే. ఎందుకంటే పది శాతానికి మించి షూటింగ్ జరక్కపోవడంతో ప్రాజెక్టు క్యాన్సిలనే ప్రచారం ఈ మధ్య ఊపందుకుంది.
నిన్న దానికి క్లారిటీ దొరికేసింది. రాబిన్ హుడ్ ప్రెస్ మీట్ లో నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ దర్శకుడు హరీష్ శంకర్ పవర్ ఫుల్ స్క్రిప్ట్ లాక్ చేసుకుని సిద్ధంగా ఉన్నారని, పవన్ డేట్స్ ఇవ్వడం ఆలస్యం త్వరగా ఫినిష్ చేసి వచ్చే ఏడాది రిలీజ్ చేస్తామని ప్రకటించారు. పవర్ స్టార్ మూవీ అంటే అన్ని ప్యాన్ ఇండియాలకు మించిన బజ్ ఉంటుందని, దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని స్పష్టత ఇచ్చారు. అయితే ఎప్పటి నుంచి ఎప్పటిలోగా అనేది చెప్పలేదు కానీ ఉస్తాద్ పట్టాల మీదే ఉన్నాడనే భరోసా అయితే వచ్చింది. తేరి రీమేక్ అయినప్పటికీ ఒరిజినల్ తో పోల్చలేనన్ని మార్పులు చాలానే చేశారట.
అయినా కూడా ఉస్తాద్ భగత్ సింగ్ కు ఇంకొంచెం ఎక్కువ టైం పట్టేలా ఉండటంతో హరీష్ శంకర్ ఆ లోగా మరో సినిమా పూర్తి చేసేందుకు ఇతర హీరోలను కలిసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. బాలకృష్ణ, వెంకటేష్, రామ్ లకు వేర్వేరుగా కథలు వినిపించారనే టాక్ ఉంది కానీ ఫైనల్ గా ఎవరు ఓకే అవుతారనేది తేలలేదు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వస్తే శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ నుంచి గబ్బర్ సింగ్ రేంజ్ ఆల్బమ్ ని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కీలకమైన విలన్ పాత్రను తమిళ నటుడు పార్తిబన్ ని ఎంచుకున్నట్టు సమాచారం. సో ఉస్తాద్ ఫ్యాన్స్ టెన్షన్ పడకుండా రిలాక్స్ అవ్వొచ్చు.