ఇలాంటి సినిమాలకు నన్నెందుకు అడగరు?


సీనియర్ నటుడు జగపతిబాబు హీరో వేషాలు మానేసి.. విలన్, క్యారెక్టర్ రోల్స్ వైపు అడుగులు వేశాక ఆయన కెరీర్ ఎలా మలుపు తిరిగిందో తెలిసిందే. కొన్నేళ్లుగా తెలుగులోనే కాదు.. దక్షిణాదిన వివిధ భాషల్లో భారీ సినిమాలు చేస్తూ అత్యంత డిమాండ్ ఉన్న విలన్/క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారాయన. పెద్ద హీరోల సినిమాల్లో కీలకమైన పాత్రలకు ముందు కన్సిడర్ చేస్తున్నది ఆయన్నే. అందుకు తగ్గట్లే జగపతి కూడా భారీ పారితోషకం అందుకుంటున్నారు. మంచి ఊపు మీద కెరీర్‌ను కొనసాగిస్తున్నారు.

ఐతే తాను మరీ కాస్ట్లీ అనుకుని చిన్న సినిమాల్లో మంచి పాత్రలకు తనను కన్సిడర్ చేయకపోవడం పట్ల జగపతి బాబు తాజాగా ట్విట్టర్లో కొంత ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా ‘ఆహా’లో విడుదలై మంచి స్పందన రాబట్టుకుంటున్న ‘కలర్ ఫోటో’ సినిమా చూసి ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

ఈ సినిమా మీద జగపతిబాబు ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమా తననెంతగానో ఆకట్టుకుందని, టీం అంతా చాలా బాగా పని చేసిందని ప్రశంసించిన జగ్గూభాయ్.. ఒక సినిమా విజయవంతం కావడానికి భారీ బడ్జెట్, స్టార్ కాస్టే అవసరం లేదని ‘కలర్ ఫోటో’ రుజువు చేసిందని అన్నాడు. ఇలాంటి యంగ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కలిసి సృజనాత్మకతతో సినిమాలు చేస్తూ వేగంగా దూసుకెళ్తుంటే.. తన లాంటి సీనియర్లు ఏం చేస్తున్నామో అనిపిస్తుందని జగ్గూ భాయ్ కామెంట్ చేశాడు.

అంతే కాక ఇలాంటి సినిమాల్లో తాను కూడా భాగం అయితే గర్వపడతానని.. కానీ ఈ తరహా చిత్రాల్లో తాను నటించను అనో, లేక డబ్బులు ఎక్కువ అడుగుతాననో భావించి తనను అడుగుతుండకపోవచ్చని.. కానీ ఆ రెండూ అబద్ధమే అని చెప్పడం ద్వారా చిన్న సినిమాల్లో మంచి పాత్రలుంటే పారితోషకం తగ్గించుకుని చేయడానికి కూడా తాను రెడీ అని చెప్పకనే చెప్పాడు జగపతి. ఇది యువ ఫిలిం మేకర్లకు సంతోషాన్నిచ్చే విషయమే.