అభిమానులతో సహా అందరిలోనూ ఉన్న సందేహం ఒకటే. ఏపీ ఉపముఖ్యమంత్రిగా ఎడతెగని బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు బ్యాలన్స్ ఉన్నవి కాకుండా కొత్త సినిమాలు చేస్తాడా లేదాని. హరిహర వీరమల్లు, ఓజిలు ఇంకొంచెం పెండింగ్ ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ ఉంటుందో లేదోననే అనుమానాలు మొదలయ్యాయి. సురేందర్ రెడ్డికి గతంలో ఓకే చేసిన ప్రాజెక్టు క్యాన్సిలనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ స్వయంగా చెబితే తప్ప క్లారిటీ రాని పరిస్థితిలో ఎట్టకేలకు సమాధానం దొరికేసింది. తాజాగా ఒక తమిళ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తన మనోగతాన్ని వివరించారు.
డబ్బు అవసరం ఉన్నంత కాలం సినిమాలు ఆపనని, కాకపోతే పాలన వ్యవహారాలకు సంబంధించి ఎలాంటి రాజీ పడకుండానే రెండు బ్యాలన్స్ చేసేలా ప్లాన్ చేస్తానని వివరించారు. జనసేన నిర్వహణ, ప్రచారం, సహాయాలు, విరాళాలు, దత్తతలు ఇలా ఎన్నో కార్యక్రమాల కోసం పవన్ కు ఆర్థిక మద్దతు ఎప్పటికప్పుడు అవసరమవుతూనే ఉంటుంది. కానీ వినడానికి బాగానే ఉంది కానీ పవన్ అంత సులభంగా కొత్త కమిట్ మెంట్లు ఇచ్చే సీన్ కనిపించడం లేదు. మార్చి 29 రావాల్సిన వీరమల్లు వాయిదా పడింది డిప్యూటీ సిఎం బిజీ షెడ్యూల్స్ వల్లే కదా. మరి కొత్తవి ఒప్పుకుంటే వాటికి న్యాయం చేయాగలగాలి కదా.
ఇక్కడో సానుకూలంశాన్ని గమనించుకోవచ్చు. కూటమి మొదటి ఏడాది కాబట్టి పవన్ అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. ఒక్కసారి సిస్టం సెట్ అయ్యాక క్రమంగా సినిమాలు చేసుకోవచ్చు. తక్కువ డేట్లలో వేగంగా పూర్తయ్యేలా భీమ్లా నాయక్, వకీల్ సాబ్, బ్రో లాంటివి ఎంచుకుంటే ఉభయకుశలోపరిగా ఉంటుంది. అలా కాకూండా హరిహర వీరమల్లు, ఓజి లాంటి ప్యాన్ ఇండియా గ్రాండియర్స్ అంటేనే చిక్కొస్తుంది. ఎలాగూ త్రివిక్రమ్ సలహాలు సూచనలు ఉంటాయి కాబట్టి రెండు పడవల ప్రయాణం పవన్ కళ్యాణ్ కు కష్టమేమీ కాదు. చాలా గ్యాప్ తర్వాత మే 9 పవర్ స్టార్ దర్శనం కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.