కూలీ వేగం….నేర్చుకోవాల్సిన పాఠం

రజనీకాంత్ లాంటి పెద్ద సూపర్ స్టార్. టాలీవుడ్ సీనియర్ మోస్ట్ అగ్ర హీరో నాగార్జున ప్రత్యేక పాత్ర. కన్నడలోనే బిజీగా ఉంటూ ఇతర భాషల్లో చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించే ఉపేంద్ర క్యామియో. సౌత్ సినిమాలకు దూరంగా ఉండే బాలీవుడ్ టాప్ స్టార్ అమీర్ ఖాన్ గెస్ట్ రోల్. వీళ్లకు తోడు హీరోయిన్ శృతి హాసన్ తో పాటు పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి పెట్టిన టాప్ క్యాస్టింగ్. ఇంత సెటప్ తో ఒక ప్యాన్ ఇండియా మూవీని తీయాలంటే ఎంత టైం కావాలి. సగటు ప్రేక్షకులను అడిగితే ఖచ్చితంగా రెండేళ్లని చెబుతాడు. కానీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కేవలం ఆరు నెలల వర్కింగ్ డేస్ లో కూలిని పూర్తి చేసి పెట్టాడు.

ఇంత వేగంగా ఎలా సాధ్యమంటే ఒక ప్లానింగ్, ఒక పద్ధతి అనే సమాధానం వస్తుంది. గత ఏడాది ఏప్రిల్ లో చిన్న వీడియోతో టైటిల్ అనౌన్స్ చేశారు. జూన్ లో లుక్ టెస్ట్ చేసి జూలైలో షూటింగ్ మొదలుపెట్టారు. ఆగస్ట్ లో పాత్రల పరిచయం పోస్టర్ల ద్వారా జరిగిపోయింది. సెప్టెంబర్లో రజని అఫీషియల్ ఫస్ట్ లుక్ వచ్చేసింది. డిసెంబర్ లో తలైవా పుట్టిస్తోరోజు సందర్భంగా చిన్న సాంగ్ టీజర్ వదిలారు. ఇప్పుడు మార్చి మూడో వారం రావడం ఆలస్యం గుమ్మడికాయ కొట్టేశామని సోషల్ మీడియా వేదికగా దర్జాగా ప్రకటించారు. నలుగురు అగ్ర హీరోలతో ఇంత పెద్ద బడ్జెట్ తో జెట్ స్పీడ్ లో పూర్తి చేయడం నిజంగా వండరే.

ఇక్కడ నిజంగా చూసి నేర్చుకోవాలని చెప్పింది ప్లానింగ్ గురించే. హీరోల సహకారం ఎంత ఉన్నా సంవత్సరాల తరబడి ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తున్న డైరెక్టర్లు ఎందరో ఉన్నారు. కానీ కూలిని ఇంత కూల్ గా లోకేష్ హ్యాండిల్ చేసిన విధానం అతన్నుంచి ఎక్కువ సినిమాలు వచ్చేలా చేస్తుంది. నిర్మాతల మీద ఒత్తిడి తగ్గుతుంది. అనుకున్న టైంలో ప్రశాంతంగా రిలీజ్ చేసుకునేందుకు దారి దొరుకుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న కూలి సెప్టెంబర్ లేదా అక్టోబర్ రిలీజ్ కు సన్నాహాలు చేసుకుంటోంది. వార్ 2 తో క్లాష్ ఉండొచ్చనే పుకార్లను నిర్మాణ సంస్థ కొట్టి పారేస్తోంది. అయితే దసరా లేదా దీపావళికి రావొచ్చట.