డబ్బులిస్తున్నారు కదా అని సెలబ్రెటీలు ముందు వెనుక చూసుకోకుండా ప్రమోషన్లు చేసి పెడితే ఏమవుతుందో చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. సెలబ్రెటీలను ముందు పెట్టి పెట్టుబడులను ఆకర్షించి బోర్డు తిప్పేసిన సంస్థలు ఎన్నో. ఇక గత కొన్నేళ్లలో చిన్న స్థాయి ఫిలిం సెలబ్రెటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను వాడుకుని వందలు, వేల కోట్ల వ్యాపారం చేసిన బెట్టింగ్ యాప్స్.. ఎంతోమంది సామాన్యుల జీవితాలను బుగ్గిపాలు చేసిన ఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. డబ్బులు సంపాదించడం ఇంత ఈజీనా అన్నట్లుగా సెలబ్రెటీలు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసే తీరు దారుణం అనే చెప్పాలి.
వీటి వలలో చిక్కుకుని యువత దారుణంగా దెబ్బ తింటున్న ఘటనలు రోజూ మీడియాలో, సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. వీటి తీవ్రత గురించి పోలీసులు హెచ్చరిస్తున్నా కూడా వాటిని ప్రమోట్ చేసే వాళ్లు, వాటిని వినియోగించేవాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడిది ఒక సామాజిక సమస్యగా మారిపోయింది. ఈ నేేపథ్యంలోనే బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల మీద పోలీసుల కన్ను పడింది. ఈ అంశం గురించి ఎప్పట్నుంచో హెచ్చరిస్తూ వచ్చిన సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్.. ఇప్పుడు కార్యాచారణకు నడుం బిగించారు. ఆర్టీసీ ఎండీగా ఉంటూనే ఆయన బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసే వారి పని పట్టడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే హర్ష సాయి మీద కేసు బుక్ చేయించి అరెస్ట్ చేయించే పనిలో పడ్డారు. ఈ పరిణామం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, ఫిలిం సెలబ్రెటీల్లో గుబులు పుట్టిస్తోంది.
ప్రస్తుతం వైసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న యాంకర్ శ్యామలతో పాటు కమెడియన్ ఆలీ, సుప్రీత (సురేఖావాణి తనయురాలు), రితు చౌదరి.. సహా ఎంతోమంది ఫిలిం సెలబ్రెటీలు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన వాళ్లే. వీరిలో రితు, సుప్రీత లాంటి వాళ్లు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన వీడియోలను డెలీట్ చేసేశారు. అంతే కాక గతంలో తెలియక వీటిని ప్రమోట్ చేశామని, అందుకు సారీ చెబుతూ.. ఎవ్వరూ వీటి జోలికి వెళ్లొద్దని హితవు పలుకుతున్నారు. హర్ష సాయి ఉదంతం నేపథ్యంలో తమను కూడా పోలీసులు టార్గెట్ చేస్తారనే భయంతోనే వీళ్లంతా ఇలా చేస్తున్నారన్నది వాస్తవం. ఎలాగైతేనేం ఇదొక మంచి మార్పే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.