నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా వచ్చి ఏడాది దాటిపోయింది. 2023 డెవిల్ తర్వాత మళ్ళీ దర్శనమివ్వలేదు. ఈసారి అర్జున్ సన్నాఫ్ వైజయంతిగా రాబోతున్నాడు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామాలో లేడీ అమితాబ్ గా పేరొందిన విజయశాంతి కీలక పాత్ర పోషించడం విశేషం. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు తర్వాత మళ్ళీ నటించనని చెప్పిన ఒకప్పటి ఈ సీనియర్ హీరోయిన్ ఇప్పుడీ కథ నచ్చడం వల్ల గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులోనూ బాబాయ్ బాలయ్యతో ఎన్నో సూపర్ హిట్స్ లో పాలు పంచుకున్నాక ఇప్పుడు అబ్బాయ్ తల్లిగా నటించడం విశేషమనే చెప్పాలి.
ఇవాళ విడుదల చేసిన టీజర్లో కథేంటో క్లుప్తంగా చెప్పారు. డ్యూటీ అంటే ప్రాణమిచ్చే పోలీస్ ఆఫీసర్ వైజయంతి (విజయశాంతి) కి కొడుకు అర్జున్ విశ్వనాధ్ (కళ్యాణ్ రామ్) అంటే ప్రాణం. ఎప్పటికైనా తన వారసుడిని ఖాకీ దుస్తుల్లో చూసుకోవాలని కంటికి రెప్పలా పెంచుతుంది. అయితే తల్లి కర్తవ్యం కోసం పాటు పడినట్టే కొడుకు సమాజంలో చీడపురుగులను ఏరిపారేయడానికి నరసింహావతారం ఎత్తుతాడు. కానీ తప్పు చేస్తే బిడ్డ అయినా సరే క్షమించే మనసత్త్వం లేని వైజయంతికి అర్జున్ కు మధ్య అడ్డుగోడలు ఏర్పడతాయి. అవి ఎవరి వల్ల, చివరికి ఏం జరిగిందనేది తెరమీద చూడాలి.
యాక్షన్, ఎమోషన్, సెంటిమెంట్, ఎలివేషన్ అన్నీ ఉండేలా దర్శకుడు ప్రదీప్ తీసుకున్న శ్రద్ధ టీజర్ లో కనిపించింది. స్టోరీ పరంగా మరీ నెవర్ బిఫోర్ అని కాదు కానీ పటాస్ తరహాలో మరోసారి బలమైన కంటెంట్ కళ్యాణ్ రామ్ కు పడిందన్న నమ్మకం అభిమానులకు కలిగేలా ఉంది. అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో హైలైట్ గా నిలవగా హీరోయిన్ సయీ మంజ్రేకర్ తో పాటు శ్రీకాంత్ ఇతర ఆర్టిస్టులను ఎక్కువ రివీల్ చేయకుండా ఒకటి రెండు షాట్స్ కు పరిమితం చేశారు. త్వరలోనే విడుదల కానున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఈ వేసవిలోనే థియేటర్లలో అడుగు పెట్టేందుకు ముస్తాబు అవుతోంది.