నిజమా…OG సెప్టెంబర్లో వస్తుందా

మే 9 విడుదల కాబోతున్న హరిహర వీరమల్లు కన్నా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి మీదే ఎక్కువ ప్రేముందనేది బహిరంగ రహస్యం. హైప్ పరంగా రెండింటి మధ్య ఆ స్థాయిలో వ్యత్యాసం ఉంది మరి. దర్శకుడు సుజిత్ టీజర్లో చూపించిన శాంపిల్ కే ఫ్యాన్స్ కి మతి పోయినంత పనైంది. ఇంకొంచెం షూట్ బ్యాలన్స్ ఉన్న సంగతి తెలిసిందే. పవన్ డేట్స్ కోసం టీమ్ ఎదురు చూస్తూనే ఉంది. కొంత అనారోగ్యంతో కలుగుతున్న ఇబ్బందితో పాటు పాలనకు సంబంధించిన వ్యవహారాల వల్ల బిజీగా ఉన్న పవన్ వీరమల్లుకి ఏప్రిల్ లో, ఓజికి మే / జూన్ నెలల్లో కాల్ షీట్స్ ఇస్తాడనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో ఉంది.

ఇదంతా ఒకే కానీ సెప్టెంబర్ లో ఓజి విడుదల కావొచ్చనే ప్రచారం డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో మొదలవ్వడం మెగా ఫ్యాన్స్ లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. అయితే దీన్ని పూర్తిగా నమ్మడానికి లేదు. ఎందుకంటే హరిహర వీరమల్లు మేలో వస్తే కేవలం నాలుగు నెలల గ్యాప్ లో మరో పవన్ కళ్యాణ్ ప్యాన్ ఇండియా మూవీ రావడం అనుమానమే. పైగా పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్, ప్రమోషన్ అంటూ సవాలక్ష వ్యవహారాలు ఉంటాయి. అదే నెలలో అఖండ 2 తాండవం, సంబరాల ఏటిగట్టు, అక్టోబర్ మొదటివారంలో కాంతారా చాప్టర్ 1 ఉన్నాయి. ఓజి వస్తే సాయిధరమ్ తేజ్ తప్ప మిగిలినవి తప్పుకుంటాయన్న గ్యారెంటీ లేదు.

పైగా ఆగస్ట్ 14 మిస్ చేసుకుంటున్న రజనీకాంత్ కూలి కన్ను కూడా సెప్టెంబర్ మీదే ఉంది. అలాంటప్పుడు ఓజికి ఫ్రీ గ్రౌండ్ దొరకదు. లేదూ ఒకవేళ నిజంగా వద్దామనుకుంటే అదేదో అధికారిక ప్రకటన ఇచ్చేస్తే మిగిలిన నిర్మాతలు దానికి అనుగుణంగా పోటీకి రాకుండా చూసుకుంటారు. అంతే తప్ప హఠాత్తుగా నెల ముందు అనౌన్స్ మెంట్ ఇస్తే అందరికీ ఇబ్బందే. ప్రాక్టికల్ గా చూస్తే మాత్రం విన్నంత ఈజీగా ఓజి రావడం అనుమానంగానే ఉంది. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించగా విలన్ గా ఇమ్రాన్ హష్మీ టాలీవుడ్ డెబ్యూ చేస్తున్నాడు.