సప్తగిరి పక్కన హీరోయిన్ గా ఒప్పుకోలేదా…

ఈ రోజుల్లో స్టార్ హీరోల పక్కన సరైన హీరోయిన్లను సెట్ చేయడమే కష్టమవుతోంది. మన దగ్గర బోలెడంతమంది హీరోలున్నారు. కానీ మంచి గుర్తింపు ఉన్న హీరోయిన్ల సంఖ్య తక్కువే. అందుకే స్టార్ హీరోలకే హీరోయిన్లను ఎంచుకోవడంలో ఇబ్బంది అవుతోంది. అలాంటిది ఇక హీరోలుగా మారిన కమెడియన్లకు హీరోయిన్లను సెట్ చేయడం అంటే ఇంకా పెద్ద ఛాలెంజే. ఇప్పటికే హీరోగా పలు చిత్రాల్లో నటించిన కమెడియన్ సప్తగిరి.. కొంచెం గ్యాప్ తర్వాత ‘పెళ్ళి కాని ప్రసాద్’ చిత్రంతో హీరోగా రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియాంక అనే కొత్తమ్మాయి కథానాయికగా నటిస్తోంది.

ఐతే తన కంటే ముందు కొందరు పేరున్న హీరోయిన్లను ఈ సినిమాలో నటింపజేయడానికి ప్రయత్నించి విఫలమైందట చిత్ర బృందం. తన పక్కన నటించడానికి చాలామంది హీరోయిన్లు ఒప్పుకోలేదని స్వయంగా సప్తగిరే చెప్పడం గమనార్హం. ‘‘మా సినిమాలో కొంచెం పేరున్న హీరోయిన్నే పెట్టాలని దర్శకుడు అనుకున్నాడు. కానీ కమెడియన్ పక్కన కథానాయికగా నటించడం ఏంటి అని చాలామంది ఒప్పుకోలేదు. అలా నో చెప్పిన వాళ్ల లిస్ట్ చాలా పెద్దదే. చివరికి ప్రియాంకను కథానాయికగా పెట్టుకున్నాం.

ఆమె కూడా మంచి హీరోయినే. కానీ మేం ప్రయత్నించిన వేరే వాళ్లు మాత్రం నా పక్కన నటించడానికి అంగీకరించలేదు’’ అని సప్తగిరి తెలిపాడు. ఇక నిజ జీవితంలోనూ ఇంకా పెళ్లి చేసుకోకపోవడం గురించి సప్తగిరి మాట్లాడుతూ.. సినిమా వాళ్లకు అమ్మాయిని ఇవ్వడానికి జనం ఆసక్తి చూపించరని అన్నాడు. ఈ రోజుల్లో కూడా పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిని అడిగితే అమ్మో సినిమా వాళ్లా అనే అంటున్నారని సప్తగిరి వ్యాఖ్యానించాడు. ఐతే తనకు ఇంకా పెళ్లి కాలేదని ఎవ్వరూ జాలి పడాల్సిన అవసరం లేదని.. తాను చాలా హ్యాపీగా ఉన్నానని సప్తగిరి నవ్వుతూ వ్యాఖ్యానించాడు.