ఏపీ డిప్యూటీ సిఎంగా కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తి చేయాల్సినవి కాకుండా భవిష్యత్తులో కొత్త సినిమాలు చేస్తారా చేయరానే అనుమానాలు అభిమానుల్లో లేకపోలేదు. రాజకీయాలు, సామజిక సేవ, ప్రజా క్షేమమే తన ప్రాధాన్యతలని పవన్ గత కొన్ని నెలల్లో పలు సందర్భాల్లో నొక్కి చెప్పారు. నిన్న జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవంలోనూ అదే సందేశం వినిపించింది. సభకు హాజరైన అభిమానులు ఓజి ఓజి అని అరుస్తూ ఉంటే కార్యకర్తల గౌరవం కోసం ఎలాంటి నినాదాలు చేయొద్దని వారించడం చూస్తే ఉపముఖ్యమంత్రి ఆలోచనలు సినిమాల మీద తగ్గినట్టే అనిపిస్తోంది.
ఒకవేళ ఆ నిర్ణయమే తీసుకుంటే నిజంగా సమర్ధించాల్సిందే. ఎందుకంటే పవన్ కు తీరిక లేకపోవడంతో పాటు ఆరోగ్యం తరచుగా ఇబ్బంది పెడుతోంది. తన రెండో కొడుకుని ఎత్తుకోలేనంత బలహీనంగా అయ్యానని, మీ అండదండలతో ముందుకు వెళ్తానని చెప్పడం అభిమానులను కదిలించింది. ఈ లెక్కన హరిహర వీరమల్లు 1 మేలో విడుదలయ్యాక ఈ సంవత్సరం లేదా వచ్చే ఏడాది ఓజితో పవన్ ఇక సినిమాలకు స్వస్తి చెప్పినా ఆశ్చర్యం లేదు. వాస్తవంలోనూ పవర్ స్టార్ కథలు వినడం లేదు. గతంలో సురేందర్ రెడ్డితో అనుకున్న ప్రాజెక్టు సైతం ముందుకెళ్లలేక క్యాన్సిలయ్యేలా ఉందని వినికిడి.
ఒకరకంగా చెప్పాలంటే ఉస్తాద్ భగత్ సింగ్ జరిగినా గొప్పే అనుకోవాలి. సో దీంతో పాటు హరిహర వీరమల్లు రెండు భాగాలు, ఓజితో ఫ్యాన్స్ సంతృప్తి పడాల్సి ఉంటుంది. గతంలో అజ్ఞాతవాసితో ఆపేసి పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉంటానని చెప్పిన పవన్ ఆ తర్వాత ఓటమి, పార్టీ నడపడానికి నిధులు అవసరమై తిరిగి సినిమాలు కొనసాగించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఉప మంత్రిత్వంతో పాటు కీలక శాఖలు పవన్ ఆధ్వర్యంలో ఉండటంతో ఇకపై మేకప్ వేసుకుని ఎక్కువ రోజులు సెట్స్ పై ఉండటం సాధ్యం కాదు. ఇదంతా దృష్టిలో పెట్టుకునే అకీరా నందన్ ని ఇంకో రెండేళ్లలో లాంచ్ చేసే ప్లాన్ ఉందని ఇన్ సైడ్ టాక్.
Gulte Telugu Telugu Political and Movie News Updates