ఈ రోజు కర్ణాటక ప్రభుత్వం బడ్జెట్ లో సినిమా టికెట్ ధరలను గరిష్టంగా 200 రూపాయలకు పరిమితం చేస్తూ వదిలిన ప్రతిపాదన శాండల్ వుడ్ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. సింగిల్ స్క్రీన్, మల్టీ ప్లెక్స్ భేదం లేకుండా అందరికి ఇది వర్తిస్తుంది. అంటే కనిష్టంగా ఎంతైనా పెట్టుకోవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో డబుల్ సెంచరీ మార్కు దాటకూడదు. ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళ ఇలా భాషాభేదం లేకుండా అన్ని చిత్రాలకు ఇది ఫాలో కావాల్సిందే. ఇప్పటిదాకా ముఖ్యంగా బెంగళూరులో ఉన్న మల్టీప్లెక్సులు ప్యాన్ ఇండియా మూవీస్ రిలీజైన టైంలో ఆరు వందల రూపాయలుకు పైనే టికెట్ ధరలతో వ్యాపారం చేసేవాళ్ళు.
ఇప్పుడీ నిబంధనతో కొత్త చిక్కు వచ్చినట్టే. గమనించాల్సిన అంశం మరొకటి ఉంది. ఇటీవలే బెంగళూరులో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి కన్నడ సెలబ్రిటీలు రావడం లేదన్న అసంతృప్తి అధికార పార్టీ కాంగ్రెస్ మంత్రుల్లో ఘాడంగా ఉంది. డిప్యూటీ సిఎం డీకె శివకుమార్ మాట్లాడుతూ ఈ ధోరణిలో మార్పు రాకపోతే ఎలా టైట్ చేయాలో మాకు తెలుసంటూ కామెంట్ చేసిన మూడు రోజులకే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. చిన్న బడ్జెట్ సినిమాలకు ఇబ్బంది లేదు కానీ కెజిఎఫ్, కాంతార, కబ్జా లాంటి వాటికి ఈ రెండు వందల సీలింగ్ కలెక్షన్ల పరంగా చాలా చేటు చేస్తుంది.
ఇప్పుడిదే పక్క రాష్ట్రంలో సెన్సేషన్ అయ్యింది. రెండు వందలలోపే అన్ని సినిమాలకు టికెట్ రేట్లు పెడితే మనుగడ కష్టమని ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది కాలంలో వందకు పైగా సింగల్ స్క్రీన్లు మూతబడ్డాయని, ఇప్పుడిలా చేస్తే మరికొన్ని ఇదే దారిలో వెళ్ళిపోయి షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాల్స్ గా మారిపోతాయని చింతిస్తున్నారు. మరి ఇండస్ట్రీ తరఫున ఎవరైనా పెద్దలు ముందుకొచ్చి ప్రభుత్వంతో చర్చిస్తారేమో చూడాలి. ఇప్పుడీ ట్విస్ట్ తో బెంగళూరు కంటే హైదరాబాద్ మల్టీప్లెక్సుల గరిష్ట టికెట్ రేట్ (295) ఎక్కువ కావడం గమనార్షం. మొన్నటిదాకా ఇది రివర్స్ లో ఉండేది.