ఏ ముహూర్తంలో సికందర్ టీజర్ విడుదల చేశారో అప్పటి నుంచి సల్మాన్ ఖాన్ సినిమా ట్రోలర్స్ కి టార్గెట్ అయిపోయింది. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ నుంచి ఇలాంటి కంటెంట్ ఆశించలేదని మూవీ లవర్స్ షాక్ తింటున్నారు. ఇదే డైరెక్టర్ నుంచి శివ కార్తికేయన్ మదరాసి టీజర్ ఎంత పాజిటివ్ హైప్ తెచ్చిందో అందరూ చూసిందే. కానీ సికందర్ కేస్ రివర్స్ అవుతోంది. తాజాగా రిలీజ్ చేసిన పాట ప్రోమో మళ్ళీ లక్ష్యంగా మారిపోయింది. సల్మాన్ శరీరాన్ని విఎఫ్ఎక్స్ లో ఎడిటింగ్ చేశారని, జాగ్రత్తగా గమనిస్తే మొహానికి, దేహానికి మధ్య ఉన్న ప్యాచ్ స్పష్టంగా కనిపిస్తుందని ఆధారాలతో సహా ట్వీట్లు పెట్టి ఆడుకుంటున్నారు.
ఇందులో నిజమెంతనేది పక్కనపెడితే రష్మిక మందన్న లుక్స్ మీద కూడా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రాలేదు. గత మూడు బ్లాక్ బస్టర్స్ యానిమల్, పుష్ప 2, ఛావాలో తనకు గెటప్ పరంగానే కాక పెర్ఫార్మన్స్ చేయడానికి కూడా మంచి స్కోప్ దక్కింది. ముఖ్యంగా మొదటి రెండు సినిమాల్లో రన్బీర్ కపూర్, అల్లు అర్జున్ కు ధీటుగా కొన్ని సన్నివేశాలను అద్భుతంగా పండించింది. కానీ సికందర్ లో అలాంటి ఛాన్స్ ఉన్నట్టు లేదు. రెగ్యులర్ గా హీరోని చూడగానే మనసు పారేసుకుని, ఫంక్షన్ లో ఓ పాటేసుకుని తర్వాత అతని వెంట నడవడమనే రొటీన్ టెంప్లేట్ లోనే ఉంటుందని ముంబై వర్గాల అంచనా.
ఏది ఎలా ఉన్నా ఇంకో పాతిక రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టబోతున్న సికందర్ కు ఇది ఏ మాత్రం శుభ శకునం కాదు. ఇకపై వదలబోయే ప్రమోషనల్ కంటెంట్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడున్న నెగటివిటీ ఖచ్చితంగా ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపిస్తుంది. ఎంత రంజాన్ పండగ సల్మాన్ కు సెంటిమెంట్ అయినా సరే ఇదే సీజన్ లో గతంలో వచ్చిన రేస్ 3, ట్యూబ్ లైట్ లాంటివి డిజాస్టర్ కావడం మర్చిపోకూడదు. ఇప్పటికే సికందర్ మీద రీమేక్ పుకార్లు గట్టిగా తిరుగుతున్నాయి. రష్మిక మందన్న సూపర్ హిట్ సెంటిమెంట్ కి బ్రేక్ పడకూడదనేది ఆమె అభిమానుల కోరిక. ఏం జరుగుతుందో చూద్దాం.