సౌత్ ఇండియన్ సీనియర్ హీరోల్లో తనకంటూ మంచి గుర్తింపు ఉన్న నటుడు.. మాధవన్. సినిమాల ఎంపికలోనే కాక వ్యక్తిత్వంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటాడు మ్యాడీ. సొసైటీలో ఎంతో గౌరవం సంపాదించుకున్న అతడి గురించి ఇటీవల ఒక నెగెటివ్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. అతను పడుచు అమ్మాయిలతో రొమాంటిక్ చాటింగ్ చేస్తుంటాడని సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరిగింది. అందుకు ఒక స్క్రీన్ షాట్‌ను ఉదాహరణగా చూపించారు నెటిజన్లు. లవ్, హార్ట్, ఎమోజీలు పెట్టిన అమ్మాయికి అతను రిప్లై ఇచ్చినట్లుగా కనిపించింది. దీంతో మాధవన్ మీద ఒక అంచనాకు వచ్చేశారు జనాలు.
ఐతే దీని వెనుక అసలేం జరిగిందో మ్యాడీ సోషల్ మీడియా దుష్ప్రభావాల గురించి ఇచ్చిన ఒక స్పీచ్‌లో వెల్లడించాడు. సోషల్ మీడియాలో చాలామంది తన సినిమాలు చూసి నచ్చి మెసేజ్‌లు చేస్తుంటారని.. అందులో భాగంగానే ఒక అమ్మాయి తన సినిమా చూసి మెసేజ్ పెట్టిందని మాధవన్ తెలిపాడు. తన సినిమా చాలా బాగుందని, తన నటన ఎంతో నచ్చిందని, తాను ఎంతగానో ఇన్‌స్పైర్ అయ్యానని పేర్కొన్న అమ్మాయి.. చివర్లో లవ్, హార్ట్ ఎమోజీలను జోడించిందని మ్యాడీ చెప్పాడు. తన మీద అభిమానం చూపిన అందరికీ.. ‘‘థ్యాంక్యూ సోమచ్. గాడ్ బ్లెస్ యు’’ అని రిప్లై ఇస్తానని.. ఆ అమ్మాయికి కూడా అలాగే చేశానని.. కానీ తను అక్కడి వరకు స్క్రీన్ షాట్ తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిందని మాధవన్ చెప్పాడు.
జనాలకు ఆ లవ్, హార్ట్ సింబల్స్ మాత్రమే కనిపించాయని.. వాటికే నేను రిప్లై ఇచ్చానని అనుకున్నారని మాధవన్ తెలిపాడు. ఈ అనుభవం తర్వాత ఎవరికైనా రిప్లై ఇవ్వాలంటే భయపడుతున్నానని.. తన లాగా అనుభవం లేని వాళ్లు ఎన్ని ఇబ్బందులు పడతారో అని మ్యాడీ అన్నాడు. సెల్ ఫోన్ కొత్త తరం మీద తీవ్ర ప్రభావం చూపుతోందని.. పిల్లల మెదళ్లను కలుషితం చేస్తోందని మ్యాడీ ఆందోళన వ్యక్తం చేశాడు. పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తున్న సెల్ ఫోన్, సోషల్ మీడియా నుంచి వారిని వీలైనంత దూరంగా ఉంచాలని అతను పిలుపునిచ్చాడు.