అల్లు అర్జున్ & ఆట్లీ – కొత్త ప్రశ్నలు

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమాగా అట్లీ ప్రాజెక్టు మీద రకరకాల కథనాలు వినిపిస్తున్న నేపథ్యంలో అభిమానులు కొంత అయోమయానికి గురవుతున్నారు. త్రివిక్రమ్ ది ఇంకా లేటవుతుందనే స్పష్టత వచ్చేసింది కాబట్టి అందరి దృష్టి ఇప్పుడీ ప్యాన్ ఇండియా మూవీ మీదే ఉంది. కానీ చెన్నై, ముంబై వర్గాల ప్రకారం దీని వెనుక మరికొన్ని తెలుసుకోవాల్సిన విషయాలున్నాయి. అవేంటో చూద్దాం. జవాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు అట్లీ ఒక మల్టీస్టారర్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడు. సల్మాన్ ఖాన్ కి వినిపిస్తే బ్రహ్మాండంగా ఉందని ఓకే అన్నాడు. ఇంకో హీరోగా కమల్ హాసన్ ని ఒప్పించే ప్రయత్నం చేస్తానని అట్లీ చెప్పాడు.

ఇంత నమ్మేశాడు కాబట్టే అట్లీ అడగ్గానే కండల వీరుడు బాబీ జాన్ లో అసలేమాత్రం అవసరం లేని క్యామియో చేశాడు. పైసా తీసుకోలేదు. తీరా చూస్తే అదేమో డిజాస్టరైపోయింది. ఈ కాంబో కోసం పెట్టుబడులు సిద్ధం చేసుకున్న నిర్మాతలు ఇంత మొత్తమైతే వర్కౌట్ కాదని వెనుకడుగు వేశారు. దీంతో ఇదే కథను తీసుకెళ్లి అల్లు అర్జున్ ని ఒప్పించేశాడట. ఈసారి సన్ పిక్చర్స్ ముందుకొచ్చింది. బన్నీ కాబట్టి గీతా ఆర్ట్స్ పార్ట్ నర్ షిప్ ఎలాగూ ఉంటుంది. సో ఎంత ఇన్వెస్ట్ చేసినా అల్లు అర్జున్ ఇమేజ్ కి సులభంగా రికవర్ అవుతుందనే ధైర్యంతో ప్రీ ప్రొడక్షన్ వైపు అడుగులు పడిపోతున్నాయి. అంతా బాగానే ఉంది కదా.

ఇక్కడ కొన్ని కీలక ప్రశ్నలున్నాయి. ఇప్పుడు బన్నీతో అట్లీ చేయబోయేది మల్టీస్టారర్ కథేనా లేక వేరేదా, ఒకవేళ అదే అయితే రెండో హీరో ఎవరు, అంత సులభంగా దొరుకుతాడా. లేదూ ఇది ఫ్రెష్ సబ్జెక్టు అనుకుంటే ఒక్క అల్లు అర్జున్ సోలో ఇమేజ్ మీద వందల కోట్ల బిజినెస్ చేయాల్సి ఉంటుంది. పుష్ప 2 ఎంత ఇండియా ఇండస్ట్రీ హిట్ అయినా ప్రభాస్ రేంజ్ కి బన్నీ చేరుకున్నాడా అంటే వెంటనే సమాధానం చెప్పడం కష్టం. ఈ క్యాలికులేషన్ల దృష్ట్యా ప్రొడక్షన్ టీమ్ మధ్య నిత్యం చర్చలు జరుగుతున్నాయట. జాన్వీ కపూర్ హీరోయినననేది కూడా ప్రస్తుతానికి ప్రచారమే. ఈ క్వశ్చన్స్ అన్నింటికి ఉగాది నాటికి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.