డ్రాగన్ అనుకుంటే డైనోసర్ అయ్యాడు

ప్రదీప్ రంగనాథన్ హీరోగా ఇటీవలే విడుదలైన డ్రాగన్ ఆదివారంతో వంద కోట్ల మార్కు దాటేసింది. మూడో వారంలోకి అడుగు పెట్టకముందే నార్త్ అమెరికాలో 1 మిలియన్ వసూలు చేసిన చిన్న హీరో సినిమాగా కొత్త రికార్డు సృష్టించింది. బుక్ మై షోలో విడాముయార్చి (పట్టుదల) ఫైనల్ బుకింగ్స్ ని డ్రాగన్ దాటేయడం చూసి ట్రేడ్ ఆశ్చర్యపోతోంది. అజిత్ మూవీ ఫ్లాప్ అయినప్పటికీ ప్రదీప్ ఏకంగా ఆయన్ని క్రాస్ చేయడం ఊహకందనిది. దెబ్బకు ఇతగాడికి ధనుష్, విజయ్ సేతుపతి మాదిరి ఫ్యాన్ క్లబ్స్ ఏర్పడుతున్నాయి. ఊరూరా అసోసియేషన్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

తెలుగులోనూ సూపర్ హిట్టే కానీ మరీ బ్లాక్ బస్టర్ రేంజ్ కాదు. పది కోట్ల దాకా గ్రాస్ రావొచ్చని ఒక అంచనా. కోలీవుడ్ లో డ్రాగన్ అనుకుంటే డైనోసర్ అయ్యాడని ఇండస్ట్రీ వర్గాలు ప్రదీప్ రంగనాథన్ గురించి చెవులు కొరుక్కుంటున్నాయి. ఇది ఏ స్థాయి విజయమంటే ధనుష్ డైరెక్ట్ చేసిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ జాబిలమ్మా నీకు అంత కోపమా డీసెంట్ టాక్, రివ్యూలతో కనీస స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేక చతికిలబడింది. నిజానికి ఫిబ్రవరి 21 ముందు అందరూ రివర్స్ ఊహించుకున్నారు. కానీ డ్రాగన్ స్పష్టంగా పై చేయి సాధించి లవ్ టుడేని మించిపోయేలా ఫైనల్ నెంబర్లు నమోదు చేయబోతోంది.

ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేరిపోయాడు. నిర్మాణంలో ఉన్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకి బిజినెస్ ఆఫర్లు భారీగా వస్తున్నాయి. మైత్రి సంస్థ నిర్మిస్తున్న మరో సినిమాకు ఇంతకన్నా ఎక్కువ హైప్ నెలకొంటోంది. డ్రాగన్ లో ఇంజనీరింగ్ కుర్రాడి జీవితానికి సందేశం మిక్స్ చేస్తూ దర్శకుడు అశ్వత్ మరిముత్తు తీర్చిదిద్దిన విధానం యువతను బాగా ఆకట్టుకుంటోంది. దగ్గరలో చెప్పుకోదగ్గ కొత్త రిలీజులు లేకపోవడంతో డ్రాగన్ డామినేషన్ కొనసాగేలా ఉంది. మన దగ్గర రామం రాఘవం, బాపు, మజాకా, శబ్దం అన్నీ సోసో రెస్పాన్స్ తెచ్చుకోవడంతో మరోవారం డ్రాగన్ ఆధిపత్యం కొనసాగుతోంది.