సరైనోడు విలన్ ఆది పినిశెట్టి అంతకు ముందు మలుపు, ఏకవీర లాంటి సినిమాల్లో హీరోగా నటించాడు కానీ గుర్తింపు వచ్చింది మాత్రం బన్నీకి ప్రతినాయకుడిగా నటించాకే. తిరిగి ఇంత గ్యాప్ తర్వాత నిన్న శబ్దంతో ప్రేక్షకులను పలకరించాడు. హారర్ జానర్ లో రూపొందిన ఈ సౌండ్ థ్రిల్లర్ మీద దెయ్యాల ప్రియులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టే ట్రైలర్ అంచనాలు రేపడం, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడం హైప్ పెంచాయి. అన్నింటిని మించి వైశాలి కాంబినేషన్ కావడంతో ఒక వర్గం ప్రేక్షకులు దీని కోసం ఎదురు చూశారు. కానీ ఓపెనింగ్స్ శబ్దం అంతంతమాత్రమే ఉంది.
కథ పరంగా దర్శకుడు అరివజగన్ వెంకటాచలం తీసుకున్న పాయింట్ వైవిధ్యంగానే ఉంది. మన్నార్ కొండ ప్రాంతంలోని ఒక కాలేజీలో వరసగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటారు. వాటి వెనుక కారణాలు తెలుసుకోవడానికి ఘోస్ట్ ఇన్వెస్ట్ టిగేటర్ వ్యోమా (ఆది పినిశెట్టి) వస్తాడు. ఒకటి రెండు కాదు అక్కడి పాత లైబ్రరీలో ఏకంగా నలభై రెండు ఆత్మలు ఉన్నాయని గుర్తిస్తాడు. వాటి రహస్యాన్ని ఛేదించే క్రమంలో డయానా (సిమ్రాన్) గురించి తెలుస్తుంది. అసలు కాలేజీ భవనంలో అన్ని హత్యలు ఎలా జరిగాయి, ఎవరు చేయించారు, ఇంత కుట్రకు దారి తీసిన దారుణమైన నిజమేంటి లాంటి ప్రశ్నలకు సమాధానమే శబ్దం.
ఫస్ట్ హాఫ్ మొత్తం ఓ మోస్తరు సస్పెన్స్, థ్రిల్ మైంటైన్ చేసిన శబ్దం సెకండాఫ్ ఫ్లాష్ బ్యాక్ నుంచి లయ తప్పేసింది. టెక్నికల్ గా టీమ్ పనితనం మెచ్చుకునేలా ఉన్నా సగటు ప్రేక్షకులు కోరుకునే భయపెట్టే ఎలిమెంట్స్ మిస్ కావడంతో కథనం ఆసక్తి లేకుండా నడిపించింది. ప్రీ క్లైమాక్స్ లో ఇచ్చిన విలన్ ట్విస్టు కూడా వావ్ అనిపించదు. వైశాలి లాగా స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా లేకపోవడం శబ్దం అనుభూతిని తగ్గించేసింది. తమన్ పనితనం బాగుంది కానీ కెరీర్ బెస్ట్ కాదు. క్యాస్టింగ్ కూడా కొంత మిస్ ఫైర్ అయ్యింది. హారర్ అంటే విపరీతమైన ప్రేమ, ఇష్టం ఉంటే తప్ప ఈ శబ్దం మన చెవులకు ఎక్కడం కష్టం.