కథ ఉండదు….లాజిక్స్ వెతకొద్దు – నిర్మాత నాగవంశీ

పబ్లిక్ స్టేజి మీద తమ సినిమాల గురించి నిర్మాతలు కాన్ఫిడెన్స్ తో స్టేట్మెంట్లు ఇవ్వడం సహజం. తామో గొప్ప కథను ఎంచుకున్నామనో లేదా ఇప్పటిదాకా టాలీవుడ్ లో రానిది తీశామనో ఏదో ఒకటి చెబుతారు. కానీ నాగవంశీ మాత్రం దానికి భిన్నంగా మాట్లాడుతున్నారు. సితార బ్యానర్ పై మార్చి 29 విడుదల కాబోతున్న మ్యాడ్ స్క్వేర్ లో కథ, లాజిక్స్ లాంటివి ఏవి ఉండవని, దయచేసి వాటిని వెతకొద్దని, కేవలం రెండున్నర గంటల పాటు నాన్ స్టాప్ గా నవ్వించే లక్ష్యంతోనే తీశామని కుండబద్దలు కొట్టేశారు. అసలు స్టోరీ లేదని ఇంత బహిరంగంగా ఒప్పుకునే ప్రొడ్యూసర్లు అరుదనే చెప్పాలి.

ముగ్గురు ఇంజనీరింగ్ చదివిన నిరుద్యోగులు ఒక మంచోడిని వెధవ చేయడమే మ్యాడ్ స్క్వేర్ కాన్సెప్టని అనౌన్స్ చేసేశారు. మొదటి భాగం హైదరాబాద్ లో అయిపోయింది కాబట్టి ఇప్పుడు గోవాకు షిఫ్ట్ అయ్యామన్నారు. సో ఏం ఆశించాలనేది ఇంత క్లియర్ గా చెప్పాక ఇక మాట్లాడేందుకు ఏముంటుంది. కామెడీ పండితే లాజిక్స్, క్రింజ్ కామెంట్స్ ని జనం పట్టించుకోరని ఇటీవలే వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం నిరూపించింది. మ్యాడ్ స్క్వేర్ కూడా అదే రూట్ లో వెళ్తోంది. హీరోయిన్లు లేకపోయినా మాస్ కోసం ప్రతి అరగంటకు ఒక కొత్త అమ్మాయి వస్తూనే ఉంటుందని ఊరించడం ఇంకో ట్విస్ట్.

తమ మ్యాడ్ స్క్వేర్ కనక నచ్చకపోతే టికెట్ డబ్బులు డబుల్ రీ ఫండ్ నిర్మాత నాగవంశీ చేస్తారని హీరోల్లో ఒకడైన సంగీత్ శోభన్ చెప్పడం మరో కొసమెరుపు. ఈ మధ్య కాలంలో నాగవంశీ వ్యాఖ్యలు బాగా వైరలవుతున్నాయి. కొన్ని వర్కౌట్ అయితే మరికొన్ని హాట్ టాపిక్స్ గా మారిన సందర్భాలున్నాయి. గుంటూరు కారం, టిల్లు స్క్వేర్, డాకు మహారాజ్ టైంలో ఇవన్నీ ఫ్యాన్స్ కి అనుభవమే. హరిహర వీరమల్లు కనక మార్చి 28 వస్తే తమ మ్యాడ్ స్క్వేర్ ని వాయిదా వేస్తామని నాగవంశీ స్పష్టం చేశారు. అది లేకపోయినా ఒక రోజు ముందొచ్చే నితిన్ రాబిన్ హుడ్, మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ తో పోటీ తప్పదు.