కండల వీరుడిని తాకిన ట్రోలింగ్ సెగలు

నిన్న విడుదలైన సికందర్ టీజర్ మీద నెగటివ్ ఫీడ్ బ్యాక్ జోరుగా ఉంది. భారీ అంచనాలతో అభిమానులు ఎంతో ఎదురు చూస్తే రొటీన్ కంటెంట్, విజువల్స్ తో నిరాశ కలిగించారని బహిరంగంగానే అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. పైగా ఇది విజయ్ సర్కార్ రీమేకనే ప్రచారం అగ్నికి ఆజ్యం పోసినట్టయ్యింది. సల్మాన్ పిఆర్ టీమ్ దీన్ని ఖండిస్తున్నప్పటికీ నిజమా కాదా అని తేలాలంటే రిలీజయ్యేలా వరకు ఆగాల్సిందే. వీటికి తోడు మాటలు సరిగా వినిపించని స్థాయిలో కండల వీరుడి డబ్బింగ్ ముద్దగా ఉండటం పట్ల విమర్శలు వచ్చి పడుతున్నాయి. మొత్తానికి టీజర్ వల్ల డ్యామేజ్ జరిగింది.

ఇప్పుడు దీన్ని అర్జెంట్ గా రిపేర్ చేయాల్సిన బాధ్యత దర్శకుడు ఏఆర్ మురుగదాస్ మీద ఉంది. ట్రైలర్ కట్ పట్ల జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. పైగా సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నీరసంగా ఉండటం చూస్తే అసలు కల్కి మ్యూజిక్ డైరెక్టరేనా దీనికి పని చేసిందనే స్థాయిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి చాలవన్నట్టు మంచి ఊపులో ఉన్న రష్మిక మందన్నని సైతం సరిగా ప్రెజెంట్ చేయడం లేదనే కామెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. కేవలం రెండు నిమిషాల వీడియోకి ఇంత శల్య పరీక్ష జరగడం అవసరమా అంటే హైప్ దృష్ట్యా స్టార్ హీరోలకు ఇలాంటి సెగలు తప్పవు.

ఇంకో నెలలో విడుదల కాబోతున్న సికందర్ కు మరికొంత ప్యాచ్ వర్క్ పెండింగ్ ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ ని వేగంగా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రంజాన్ రిలీజ్ మిస్ కాకూడదని భాయ్ హుకుం జారీ చేయడంతో ఆ ఒత్తిడి క్వాలిటీ మీద ప్రభావం చూపిస్తోందని ముంబై వర్గాల కథనం. ఒకవేళ సరిపడా టైం తీసుకుని ప్లాన్ చేసుకుంటే ఇంత నెగటివిటీ వినిపించేది కాదని అంటున్నారు. ఇది నిజమో కాదో కానీ వరస ఫ్లాపులతో కుదేలైన సల్మాన్ కు అత్యవసరంగా ఒక బ్లాక్ బస్టర్ పడాలి. టైగర్ 3 కూడా నిరాశపరచడంతో సికందర్ ఎలాగైనా సక్సెస్ సాధించాలి. లేదంటే మార్కెట్ మరింత రిస్కులో పడుతుంది.