ప్రస్తుతం సౌత్ ఇండియా అనే కాక, ఇండియా మొత్తంలో బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకడు. ఐతే తమన్ మన ప్రేక్షకులకు ముందు సంగీత దర్శకుడిగా కంటే నటుడిగా పరిచయం. అతను శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన క్రేజీ మూవీ బాయ్స్‌లో లీడ్ యాక్టర్స్‌లో ఒకటిగా నటించిన సంగతి తెలిసిందే. అందులో అతడి కామెడీ బాగానే పండింది. కానీ తమన్ తర్వాత నటుడిగా కనిపించలేదు. అలా అని అతడికేమీ అవకాశాలు ఆగిపోలేదు. బోలెడన్ని ఛాన్సులు వచ్చాయట. 7-జి బృందావన కాలనీ సహా పలు చిత్రాల్లో అవకాశాలు వచ్చినా తమన్ నటించలేదట. ఈ విషయంలో దర్శకుడు శంకర్ తనను తిట్టినట్లు ఓ ఇంటర్వ్యూలో తమన్ వెల్లడించాడు.
సంగీత దర్శకుడిగా స్థిరపడాలన్న ఉద్దేశంతోనే నటుడిగా అవకాశాలను వదులుకున్నట్లు తమన్ తెలిపాడు. బాయ్స్ సినిమా తర్వాత నాకు చాలా ఛాన్సులు వచ్చాయి. 7-జి బృందావన కాలనీ కోసం అడిగారు. ఇంకా విజయ్, సూర్య.. ఇలా పెద్ద పెద్ద స్టార్ల సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ వేటినీ నేను ఒప్పుకోలేదు. ఇది తెలిసి శంకర్ గారు ఫోన్ చేసి తిట్టారు. నీకు మంచి బ్రేక్ ఇస్తే.. అన్ని ఛాన్సులు వచ్చినా ఎందుకు వదిలేస్తున్నావు అని అడిగారు. నేను 25 ఏళ్ల వయసు వచ్చేసరికి సంగీత దర్శకుడు కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాను.
నటుడిగా సినిమాలు ఒప్పుకుంటే నా లక్ష్యం నెరవేరదు అనిపించింది. నా ఫోకస్ మ్యూజిక్ మీదే ఉండాలనుకున్నా. బాయ్స్ సినిమా చేయడానికి కూడా కారణం ఉంది. అది శంకర్, ఏఆర్ రెహమాన్, ఏఎం రత్నం లాంటి లెజెండ్స్ కలిసి చేసిన సినిమా. అలాంటి గొప్ప వాళ్లతో కలిసి పని చేస్తే సంగీత దర్శకుడిగా నా కెరీర్‌కు ఉపయోగపడుతుందని అనుకున్నా. అంతే తప్ప నటనలో కొనసాగాలని అనుకోలేదు అని తమన్ తెలిపాడు. ఈ సందర్భంగా బాయ్స్ సినిమాకు అత్యధిక పారితోషకం అందుకుంది తానే అని.. హీరో సిద్దార్థ్ కంటే తనకే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చారని తమన్ వెల్లడించాడు.