మంచు ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం.. కన్నప్ప. టాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్స్‌లో ఒకటైన ‘భక్త కన్నప్ప’ను నేటి తరానికి అందించాలని మోహన్ బాబు, విష్ణు ఎన్నో ఏళ్ల నుంచి కలలు కంటూ వచ్చారు. ఎట్టకేలకు గత ఏడాది ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లింది. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకుని ఏప్రిల్ 25న ‘కన్నప్ప’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ పాన్ ఇండియా మూవీని దేశవ్యాప్తంగా ప్రమోట్ చేస్తున్న విష్ణు అండ్ టీం.. తాజాగా ముంబయిలో అడుగు పెట్టింది. ఈ సినిమాలో శివుడి పాత్ర పోషించిన అక్షయ్ కుమార్ సైతం టీంతో కలిసి ప్రెస్ మీట్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తనను శివుడి పాత్ర కోసం విష్ణు, మోహన్ బాబు ఒకటికి రెండుసార్లు సంప్రదించినా రిజెక్ట్ చేసిన మాట వాస్తవమే అని అక్షయ్ కుమార్ అంగీకరించాడు. ఒక దశలో విష్ణు, మోహన్ బాబు ఎన్నోసార్లు కాల్ చేసినా.. తాను స్పందించలేదని.. అందుకు బిజీగా ఉండడమే కారణమని అక్షయ్ తెలిపాడు. ఐతే వీళ్లిద్దరూ తర్వాత నేరుగా తన ఆఫీసుకు వచ్చి కలిసి మాట్లాడారని.. ఈ సందర్భంలో విష్ణు నిజాయితీ నచ్చి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నానని అక్షయ్ వెల్లడించారు. ఇక ఈ కార్యక్రమంలో విష్ణు మాట్లాడుతూ.. ఈ తరానికి శివుడు అంటే అక్షయ్ కుమారే అని.. అందుకే ఆయన్ని ఈ పాత్రలో నటింపజేశామని అన్నాడు.
అక్షయ్ కుమార్ లాంటి పెద్ద స్టార్ తమ సినిమాలో నటించాడంటే అది మోహన్ బాబు గారి వల్లే సాధ్యమైందని.. ఆయన కొడుకును కాబట్టే తన సినిమాలో అక్షయ్ నటించాడని చెప్పాడు. ఈ సినిమాలో నటించాక తనలో వ్యక్తిత్వ పరంగా చాలా మార్పు వచ్చిందని.. ఇప్పుడు ఉన్నతంగా ఆలోచిస్తున్నానని విష్ణు అన్నాడు. ఈ మూవీలో అక్షయ్, మోహన్ లాల్, ప్రభాస్.. ఇలా అందరూ అద్భుతంగా నటించారని.. సినిమా కచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నామని విష్ణు చెప్పాడు.