దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో నిర్మించిన లక్కీ భాస్కర్ గత ఏడాది ఎంత పెద్ద బ్లాక్ బస్టరో తెలిసిందే. అమరన్, క పోటీని తట్టుకుని మరీ బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ సాధించింది. వంద కోట్ల గ్రాస్ దాటేసి సగర్వంగా నిలిచింది. థియేటర్ రన్ పక్కన పెడితే నెట్ ఫ్లిక్స్ ఓటిటిలోకి వచ్చాక లక్కీ భాస్కర్ మరింత దూకుడుగా ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఒకటి రెండు కాదు ఏకంగా పదమూడు వారాల పాటు నాన్ స్టాప్ లో ట్రెండింగ్ జరిగిన మొదటి సౌత్ ఇండియన్ మూవీగా నిర్మాణ సంస్థ నిన్న అధికారికంగా ప్రకటించింది. ఇంతగా డిజిటల్ ప్రేక్షకులు ఎందుకు ఆదరించారో చూద్దాం.
లక్కీ భాస్కర్ కథా నేపథ్యం ముప్పై సంవత్సరాల వెనుకటిదే అయినా సగటు మధ్య తరగతి జీవితాలను మనస్తత్వాలను ప్రతిబింబించేలా ఉంటుంది. మిడిల్ క్లాస్ ఎమోషన్స్ వెంకీ అట్లూరి ఒడిసిపట్టుకుని చూపించిన తీరు రిపీట్ షోలు వేసుకునేలా చేసింది. దుల్కర్ కుటుంబం నగలకొట్టుకు వెళ్లి షాపింగ్ చేసే ఎపిసోడ్, బ్యాంకులో తన బ్యాలన్స్ గురించి గర్వంగా అందరికీ చెప్పుకునే సీన్, సీబీఐని బురిడీ కొట్టించి విదేశాలకు వెళ్లిపోయే ప్లాన్, డబ్బు కోసం వేరొకరి జీవితాలతో చెలగాటమాడకుండా స్వార్థం నిండిన మేనేజ్ మెంట్ ని మోసం చేయడం లాంటివి బాగా కనెక్ట్ అయ్యాయి. ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేశాయి.
వసూళ్లు బాగా వచ్చినా లక్కీ భాస్కర్ ని థియేటర్లో మిస్ అయిన జనాలు బోలెడు. పుష్ప 2 లాగా అధిక శాతం టికెట్లు కొని చూసేయలేదు. వాళ్ళందరూ ఓటిటిలో వచ్చాక చూసి ఆశ్చర్యపోయారు. విజువల్ ఎఫెక్ట్స్, భారీ నిర్మాణ విలువలు, ఖరీదైన ఫారిన్ లొకేషన్లు, ఐటెం సాంగ్స్, వైరల్ పాటలు ఇవేవి లేకపోయినా భాషలకు అతీతంగా లక్కీ భాస్కర్ ఆదరణ దక్కించుకోవడం ఒక రకమైన కేస్ స్టడీ లాంటిది. క్రైమ్ థ్రిల్లర్ మహారాజాని దాటేసి దూసుకుపోవడం గురించి పెద్ద విశ్లేషణలే రాయొచ్చు. సోలో హీరోగా దుల్కర్ సల్మాన్ కు లక్కీ భాస్కర్ ఎప్పటికీ మర్చిపోలేని టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాగా నిలిచిపోయి అతని మార్కెట్ ని పెంచింది.