నిన్నటి దాకా దొరకడమే మహా కష్టం, ఏదైనా వర్క్ చేయించుకోవడం అంత కన్నా సవాల్ అనే రీతిలో ఉన్న అనిరుధ్ రవిచందర్ మెల్లగా టాలీవుడ్ ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. తను కమిటైన సినిమాలకు సంబంధించిన వర్క్స్ ని దర్శకులు కోరుకున్న టైంలో ఇచ్చేస్తున్నాడు. ఇటీవలే వచ్చిన, రాబోతున్న అప్డేట్సే దానికి సాక్ష్యం. మొన్నామధ్య విజయ్ దేవరకొండ ‘కింగ్ డం’ టీజర్ కు ఆలస్యం చేయకుండా మంచి అవుట్ పుట్టే ఇచ్చాడు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కథను ఎక్కువ రివీల్ చేయకుండా కట్ చేయడంతో ఎలివేషన్లు భీభత్సంగా కుదరలేదు కానీ అనిరుధ్ మార్క్ మాత్రం స్పష్టంగా వినిపించింది.
ఇదే డైరెక్టర్ కాంబోలో తెరకెక్కిన ‘మేజిక్’ నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో పది రోజుల క్రితం వచ్చేసింది. వ్యూస్ ఒకటిన్నర మిలియన్లే ఉన్నాయి కానీ స్లో పాయిజన్ లా ఎక్కుతుందనే ధీమా అభిమానుల్లో ఉంది. ఈ సినిమా ఫైనల్ వెర్షన్ రీ రికార్డింగ్ త్వరలోనే చేయబోతున్నారు. ఇక నాని శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కబోతున్న ‘ది ప్యారడైజ్’ టీజర్ మార్చి 3 రానుంది. కంటెంట్ ప్రైవేట్ గా చూసిన వాళ్ళు ఓ రేంజ్ లో పొగుడుతున్నారు. దసరాకి పదింతల వయొలెన్స్ ఉండబోతోందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అనిరుద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ ఓ రేంజ్ లో వచ్చిందని తెగ ఊరిస్తున్నారు. ఫైనల్ కట్ ఓకే అయిపోయింది.
తెలుగుకు సంబంధించి ఈ మూడు సినిమాలు అనిరుధ్ కు కీలకం కాబోతున్నాయి. చిరంజీవి – ఓదెల, బాలకృష్ణ – గోపీచంద్ మలినేని సినిమాలు ఒప్పుకున్నాడనే టాక్ ఉంది ఇంకా ఫైనల్ అగ్రిమెంట్స్ జరగాల్సి ఉంది. తమిళంలో బిజీ గురించి చెప్పాల్సిన పని లేదు. విజయ్ జన నాయగన్, రజినీకాంత్ జైలర్ 2 – కూలి, శివ కార్తికేయన్ మదరాసి, కమల్ హాసన్ ఇండియన్ 3 – విక్రమ్ 2, కార్తీ ఖైదీ 2 తదితర ప్రాజెక్టులు కన్ఫర్మ్ అయ్యాయి. ఇంత టైట్ షెడ్యూల్ లో అనిరుద్ మనోళ్లకు తగినంత సమయం ఇవ్వడం ఏమో కానీ అతన్నుంచి బెస్ట్ రాబట్టుకోవడంలో దర్శకుల అసలైన సక్సెస్ దాగి ఉంటుంది. అదే అసలైన ఛాలెంజ్.