మహేష్ సినిమాపై రాజమౌళి ప్రెస్ మీట్?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ మూవీగా మారే అవకాశమున్న రాజమౌళి-మహేష్ బాబు చిత్రం ఇటీవలే సెట్స్ మీదికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఎప్పుడో అనౌన్స్ చేసినప్పటికీ.. చిత్రీకరణ మొదలు కావడానికి చాలా టైం పట్టింది. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో వేసిన భారీ సెట్లో షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ఐతే ఈ సినిమాకు ముహూర్త వేడుకను సీక్రెట్‌గా చేసిన చిత్ర బృందం.. సినిమా మొదలైనట్లు అధికారికంగా కూడా ప్రకటించలేదు. ఇక సినిమా గురించి వేరే అప్‌డేట్ ఏదీ కూడా లేదు.

ఎన్నో ఏళ్ల ఎదురు చూపుల తర్వాత మొదలైన సినిమా గురించి ఒక అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా లేకపోవడం అభిమానులను ఒకింత నిరాశకు గురి చేసింది. మామూలుగా తన సినిమాలు మొదలయ్యే ముందు, మొదలైన మొదట్లో ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో, అభిమానులతో విశేషాలు పంచుకోవడం రాజమౌళికి అలవాటు అప్పుడే కథాంశం గురించి కూడా ఆయన వెల్లడిస్తారు. కానీ ఇప్పటిదాకా మహేష్ సినిమా గురించి ఏ కబురూ చెప్పలేదు జక్కన్న. ఐతే త్వరలోనే జక్కన్న తన మార్కు ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్లు సమాచారం. సినిమా ఒక షెడ్యూల్ పూర్తయ్యాక ప్రెస్ మీట్ పెట్టాలని చూస్తున్నారట.

ఈ షెడ్యూల్ అవ్వడానికి ఇంకో నెల రోజుల దాకా టైం పడుతుందట. మార్చి నెలాఖర్లో లేదా ఏప్రిల్లో తమ సినిమా గురించి విలేకరుల సమావేశం నిర్వహించనున్నాడట రాజమౌళి. మహేష్ ఈ ప్రెస్ మీట్లో పాల్గొనే అవకాశం లేదు. జక్కన్నే నిర్మాతలతో ప్రెస్ మీట్ పెట్టి.. ఈ సినిమా కథాంశం గురించి బ్రీఫింగ్ ఇస్తాడట. ఆ సమయంలోనే ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ గురించి కూడా వెల్లడిస్తారు. టెంటేటివ్ రిలీజ్ డేట్ కూడా చెప్పే అవకాశముంది. వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని 2027లో రిలీజ్ చేసే అవకాశముంది. ఇది ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ థ్రిల్లర్ అని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మరి ప్రెస్ మీట్లో జక్కన్న పంచుకునే విశేషాలు ఎలా ఉంటాయో చూడాలి.