అకీరా ఎంట్రీకి తెర వెనుక కసరత్తు

జూనియర్ పవన్ కళ్యాణ్ గా అభిమానులు ఎదురు చూస్తున్న అకీరానందన్ ఎంట్రీకి సంబంధించి ఎలాంటి ప్రకటన ఇంకా రాలేదు కానీ తెర వెనుక కసరత్తు జరుగుతున్నట్టు ఇన్ సైడ్ టాక్. కథ, దర్శకుడు, జానర్ తదితర అంశాల మీద వీలు దొరికినప్పుడల్లా పవన్ మిత్ర బృందం పలు ప్లాన్లు వేస్తోందట. ఇందులో ప్రధానంగా త్రివిక్రమ్ శ్రీనివాస్, నాగవంశీ, ఆనంద సాయి కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఇంకో రెండు సంవత్సరాల తర్వాత పరిచయం చేసినా సరే అకీరా తెరంగేట్రంకు సంబంధించి ఎలాంటి ప్లానింగ్ ఉండాలనేది ఇప్పటినుంచే వీళ్ళ చర్చలోకి వస్తున్న ప్రధాన అజెండాగా చెబుతున్నారు.

టాలీవుడ్ కు సంబంధించి వారసుల కోసం ఎదురు చూస్తున్న హీరోల్లో రెండు పేర్లే ప్రధానంగా వినిపిస్తున్నాయి. మొదటిది మోక్షజ్ఞ. అంతా ఓకే అనుకుంటున్నా టైంలో ఇతని ఓపెనింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఎప్పుడనేది బాలకృష్ణ వెల్లడించడం లేదు కానీ ఇంకొంత సమయం పట్టేలా ఉంది. మరొకటి అకీరానందన్. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సిఎంగా పాలనలో బాగా బిజీ అయ్యాక బ్యాలన్స్ ఉన్న హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ లకే డేట్లు ఇవ్వలేక సతమతమవుతున్నారు. ఇవి రిలీజయ్యాక పవర్ స్టార్ ఇక సినిమాలు చేయడం డౌటే. అందుకే వాళ్ళ ఫోకస్ అకీరానందన్ మీదే ఉంది.

కుర్రాడు మాత్రం ఫిజిక్, ఫీచర్స్, బాడీ లాంగ్వేజ్ అన్నీ తెరకు తగట్టు సిద్ధం చేసుకునే ఉన్నాడు. నటనకు కావాల్సిన శిక్షణ ఒక విడత వైజాగ్ సత్యానంద్ దగ్గర ఆల్రెడీ పూర్తయ్యింది. మార్షల్ ఆర్ట్స్, డాన్సు కోసం ఇంకా ట్రైనింగ్ ప్లాన్ చేయాలట. తన వారసుడిగా అకీరా మీద ఎంత బరువు ఉంటుందో ముందే తెలిసిన పవన్ కళ్యాణ్ దానికి తగ్గట్టే ఆ బాధ్యతను ప్రాణ స్నేహితులకు ఇచ్చినట్టు తెలిసింది. ఏది ఏమైనా ఇంకొంత వెయిటింగ్ అయితే తప్పదు. గ్రీన్ సిగ్నల్ రావాలే కానీ అగ్ర నిర్మాణ సంస్థలన్నీ పరిచయం చేసేందుకు ముందుకు వస్తాయి. మోస్ట్ వాంటెడ్ డెబ్యూగా అకీరాకు దక్కే స్వాగతమైతే మాములుగా ఉండదు.