‘డాకు’ టీంకు ప్రశంసలు, తిట్లు : ఎందుకంటే…!

నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రం ‘డాకు మహారాజ్’ రెండు రోజుల కిందటే డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చింది. స్ట్రీమింగ్ జెయింట్ నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని స్ట్రీమ్ చేస్తోంది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్‌లో రిలీజైన దగ్గర్నుంచి ఇండియా మొత్తంలో నంబర్ వన్ ప్లేసులో ట్రెండ్ అవుతుండడం విశేషం. తెలుగు వాళ్లే కాక ఇతర భాషల వాళ్లు కూడా ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారు. ఎక్స్‌లో అయితే డాకు గురించి బోలెడు పోస్టులు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలోని కొన్ని మాస్ సీన్ల గురించి.. అలాగే బాలయ్య పెర్ఫామెన్స్, తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్, బాబీ టేకింగ్ గురించి అందరూ గొప్పగా మాట్లాడుతున్నారు.

అదే సమయంలో చిత్ర బృందం మీద విమర్శలు గుప్పిస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. కానీ ఆ విమర్శల్లో ద్వేషం లేదు. ప్రేమ మాత్రమే ఉంది. ‘డాకు మహారాజ్’లో ఉన్న కంటెంట్‌కు ఆ సినిమా ఇంకా పెద్ద హిట్ కావాల్సిందన్నది చాలామంది వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. బాలయ్య ఇప్పటిదాకా చేయని మాస్ కాదు కానీ.. ఇందులో స్టైలిష్‌గా మాస్ సన్నివేశాలను ప్రెజెంట్ చేసిన తీరుకు, ఎలివేషన్లకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బాలయ్య సినిమా అంటే ఊర మాస్ అనే అనుకుంటారు కానీ.. ఇందులో మాస్‌ సన్నివేశాలను కూడా చాలా స్టైలిష్‌గా తీశాడు బాబీ. బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్, తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా పీక్స్ అనిపిస్తాయి.

బాలయ్య చిత్రాల్లో ఎన్నడూ చూడని విజువల్ అప్పీల్ ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టింది. ఐతే రిలీజ్ ముంగిట సినిమాను సరిగా ప్రమోట్ చేయకపోవడం, సరైన ప్రమోషనల్ కంటెంట్ ఇవ్వకపోవడం వల్ల హైప్ క్రియేట్ కాలేదని.. రిలీజ్ తర్వాత కూడా హిట్ టాక్ వచ్చింది కదా అని టీం రిలాక్స్ అయిపోయిందని.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ముప్పును తక్కువ అంచనా వేసిందని.. అందుకే సినిమా ఎబోవ్ యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని బాలయ్య ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

‘దబిడి దిబిడి’ పాటకు సోషల్ మీడియాలో కొంచెం ఎక్కువ హైప్ ఇవ్వడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని పక్కన పెట్టి ‘సంక్రాంతికి వస్తున్నాం’ వైపు వెళ్లిపోయారని.. సినిమాలోని పాప సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్లను హైలైట్ చేసి ఉంటే కథ వేరుగా ఉండేదని కూడా అంటున్నారు. ఈ సినిమాను రెండోసారి చూస్తున్నవాళ్లు, తొలిసారి వీక్షిస్తున్న వాళ్లు ముక్తకంఠంతో చెబుతున్న మాటేంటంటే.. ‘డాకు..’లో ఉన్న కంటెంట్‌కు అది ఇంకా పెద్ద హిట్ కావాల్సిందని.