ఒకే బ్యానర్ నుంచి రెండు స్టార్ హీరోల సినిమాలు ఒకే టైంలో రిలీజ్ చేయడమనేది గత దశాబ్ద కాలంలో చూసుకుంటే పెద్దగా కనిపించవు. ఈ ట్రెండ్ ని మొదలుపెట్టింది మైత్రి మూవీస్. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి కేవలం ఒక్క రోజు గ్యాప్ తో 2023 సంక్రాంతికి విడుదల చేసి ఆశ్చర్యపరిచారు. డబుల్ జాక్ పాట్ లా అవి ఘనవిజయం సాధించడం షాక్ కి గురి చేసింది. దీన్నే దిల్ రాజు ఫాలో అవుతూ మొన్న పండక్కు గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాంని ఒకే వారంలో తీసుకొచ్చారు. ఒకటి తీవ్రంగా నిరాశపరిచిన మరొకటి ఏకంగా మూడు వందల కోట్లు కొల్లగొట్టి డిస్ట్రిబ్యూటర్లకు కనకవర్షం కురిపించింది.
ఇప్పుడు మరోసారి మైత్రి ఈ ట్రెండ్ ని కొనసాగిస్తోంది. ఏప్రిల్ 10 అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ రెడీ అవుతోంది. వాయిదా పడుతుందేమోననే పుకార్లకు చెక్ పెడుతూ ప్రమోషన్లలో ఎప్పటికప్పుడు డేట్ ని నొక్కి వక్కాణిస్తూనే ఉన్నారు. విడాముయార్చి (పట్టుదల) తీవ్రంగా నిరాశ పరచడంతో ఫ్యాన్స్ దీని మీద చాలా కసిగా ఉన్నారు. దానికి తోడు దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ టీమ్ నుంచి వస్తున్న లీక్స్ అంతకంతా ఎగ్జైట్ మెంట్ పెంచుతున్నాయి. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా మొదటి రోజు వంద కోట్లతో ఖాతా తెరవడం ఖాయమని ట్రేడ్ టాక్. గోట్ ని మించిన ఓపెనింగ్ వస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అదే రోజు సన్నీ డియోల్ జాత్ విడుదల చేసేందుకు రంగం సిద్ధమయ్యింది. గదర్ 2 లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మూవీ కావడంతో నార్త్ సర్కిల్స్ లో జాత్ మీద మాములు క్రేజ్ లేదు. థియేటర్ – నాన్ థియేటర్ కలిపి కనీసం అయిదు వందల కోట్ల దాకా బిజినెస్ జరగొచ్చని ఒక అంచనా. పోటీ లేని సీజన్ కావడంతో మాస్ సినిమాలకు మొహం వాచిపోయిన ఉత్తరాది ప్రేక్షకులు జాత్ ని ఎగబడి చూడటం ఖాయం. గోపీచంద్ మలినేని కమర్షియల్ పల్స్ గురించి తెలిసిందేగా. సో సేమ్ డే రిలీజ్ మంత్రం కనక మైత్రికి మరోసారి వర్కౌట్ అయితే బాక్సాఫీస్ దగ్గర కురవబోయే కాసుల పంట మాములుగా ఉండదు.