తన కెరీర్లో అత్యంత పేలవ దశను ఎదుర్కొంటున్నారు తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్. ఇండియన్-2, గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్లతో ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇది చాలదని ‘యందిరన్’ (తెలుగులో రోబో) సినిమా కథను కాపీ కొట్టాడంటూ అరూర్ తమిళనాథన్ అనే వ్యక్తి వేసిన కాపీ రైట్ కేసు విషయమై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చెన్నై జోనల్ కార్యాలయం.. రూ.10 కోట్ల విలువైన శంకర్ ఆస్తులను ఎటాచ్ చేయడం సంచలనం రేపింది. ఈ విషయం బయటికి పొక్కాక రెండు రోజులు శంకర్ మౌనం వహించారు. ఇప్పుడీ వ్యవహారంపై ఆయన మీడియాతో మాట్లాడారు.
కోర్టు తీర్పును పక్కన పెట్టి ఈడీ ఇలాంటి చర్యలకు పాల్పడడం తననెంతో బాధించిందని శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఈడీ చర్యలకు సంబంధించి పలు విషయాలను ప్రేక్షకుల దృష్టికి తేవాలనుకుంటున్నా. ఎందిరన్ సినిమాకు సంబంధించి నిరాధారమైన ఆరోపణలను చూపించి నాకు సంబంధించిన మూడు స్థిరాస్తులను తాత్కాలికంగా ఎటాచ్ చేశారు. ఈ చర్య చట్ట ప్రక్రియ దుర్వినియోగాన్ని సూచిస్తుంది. న్యాయపరమైన వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తుంది. ఎందిరన్ కాపీ రైట్ కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు క్షుణ్ణంగా విచారణ జరిపి తీర్పునిచ్చిన విషయాన్ని హైలైట్ చేయాల్సిన అవసరం ఉంది.
ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఆ సినిమాకు సంబంధించి అసలైన హక్కులు తనవే అంటూ అరూర్ తమిళనాథన్ వేసిన పిటిషన్‌ను కొట్టి వేసింది. ఈ కేసుపై ఇప్పటికే కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈడీ నా ఆస్తులను ఎటాచ్ చేసింది. కాపీ రైట్ ఉల్లంఘన జరగలేదని కోర్టు ఇచ్చిన తీర్పును పట్టించుకోకుండా ఇలాంటి చర్యలు తీసుకోవడం నన్నెంతో బాధించింది’’ అని శంకర్ పేర్కొన్నాడు. ఈడీ చర్యలపై శంకర్ కోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.