టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకడైన హరీష్ శంకర్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన చివరి చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ బాక్సాఫీస్ దగ్గర పెద్ద షాకే ఇచ్చింది. ‘గబ్బర్ సింగ్’, ‘గద్దలకొండ గణేష్’ చిత్రాల తరహాలోనే ఇది కూడా రీమేక్ కావడంతో వాటి బాటలోనే సూపర్ హిట్ అయిపోతుందని అనుకున్నారు హరీష్ అభిమానులు. కానీ ఈసారి హరీష్ మ్యాజిక్ పని చేయలేదు. ఇది హరీష్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది.
ఈ సినిమా కంటే ముందు మొదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఎటూ కదలకుండా ఉండిపోయింది. ‘మిస్టర్ బచ్చన్’ రిలీజై ఆరు నెలలు దాటుతున్నా.. ‘ఉస్తాద్..’ను ముందుకు తీసుకెళ్లలేకపోతున్నాడు హరీష్. పవన్ కళ్యాణ్ ఉన్న బిజీలో ఈ సినిమాను ఇప్పుడిప్పుడే టేకప్ చేసే పరిస్థితి కనిపించట్లేదు. మరోవైపు హరీష్ వేరే సినిమాను కూడా ఇప్పట్లో మొదలుపెట్టనున్నట్లు వార్తలేమీ రావట్లేదు.
మొత్తంగా ప్రస్తుతానికి హరీష్ ఖాళీనే అని చెప్పాలి. ఈ టైంలో ఆయన నటన వైపు అడుగులు వేస్తుండడం విశేషం. ఇంతకుముందు కొన్ని చిత్రాల్లో హరీష్ చిన్న చిన్న క్యామియో రోల్స్ చేశాడు. దాన్ని నటనగా చెప్పలేం. కొన్ని క్షణాలు కనిపించిన పాత్రలవి. ఐతే తొలిసారి హరీష్ సీరియస్‌గా యాక్టింగ్ చేయబోతున్నాడు. సుహాస్ కొత్త చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’ చిత్రంలో హరీష్ ఓ పాత్ర చేస్తున్న విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
రామ్ గోధల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దగ్గుబాటి రానా సమర్పిస్తున్నాడు. సుహాస్ సరసన తమిళ హిట్ ‘జో’ ఫేమ్ మాళవిక మనోజ్ నటిస్తోంది. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ సినిమా వేసవిలో విడుదల కాబోతోంది. ఇందులో హరీష్ చేయదగ్గ పాత్ర ఉండడంతో చిత్ర బృందం ఆయన్ని సంప్రదించడం.. ఓకే చెప్పడం.. నటించడం.. చకచకా జరిగిపోయాయి. మరి నటుడిగా హరీష్ ముద్ర ఎలా ఉంటుందో చూడాలీ సినిమాలో.
Gulte Telugu Telugu Political and Movie News Updates