మరో బలగం అన్నారు…బలం సరిపోయిందా

హాస్యనటులు దర్శకత్వంలోనూ ప్రతిభ చాటవచ్చని బలగంతో వేణు యెల్దండి నిరూపించాడు. ఏకంగా నితిన్ తో పెద్ద బడ్జెట్ ఎల్లమ్మ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఇదే స్ఫూర్తితో ధనరాజ్ నిన్న రామం రాఘవంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మిమ్మల్ని ఎమోషన్స్ తో ఏడిపిస్తానని, మంచి సినిమా చూసిన అనుభూతి కలిగిస్తానని ముందు నుంచి హామీ ఇస్తూ వచ్చాడు. దానికి తగ్గట్టే సీనియర్ ఆర్టిస్ట్ సముతిరఖని టైటిల్ రోల్ పంచుకోవడానికి ముందుకు రావడం, ప్రమోషన్ కంటెంట్ బాగుండటం సానుకూలంగా కనిపించాయి. అయితే క్యాస్టింగ్ వల్ల రామం రాఘవంకు నిన్న పెద్దగా ఓపెనింగ్స్ దక్కలేదు.

స్టోరీపరంగా చూస్తే లైన్ కొంత విభిన్నంగానే ఉంటుంది. మంచి ఉద్యోగం చేస్తున్న తండ్రికి జులాయిగా మారి, ఊరంతా అప్పులు చేసిన చెడిపోయిన కొడుకు ఉంటాడు. ఎప్పటికైనా మారతాడనే ఆశతో నాన్న ఉంటే అతని ప్రాణాల మీదకు తెచ్చే సాహసానికి పూనుకుంటాడు కొడుకు. ఇది తెలిశాక ఇద్దరి మధ్య జరిగిన సంఘర్షణ, చివరికి ఏ మజిలీకి వీళ్ళ ప్రయాణం చేరుకుందనేది అసలు ప్లాట్. భావోద్వేగాలకు బోలెడు స్కోప్ ఉన్నప్పటికీ డ్రామాని రక్తి కట్టించేలా నడిపించడంలో ధనరాజ్ పడిన తడబాటు దీన్నో గొప్ప సినిమాగా నిలపలేకపోయింది. తనలో విషయం ఉందని నిరూపించినా బెస్ట్ అనిపించుకునేందుకు చాల్లేదు.

ముందు నుంచి బలగం స్థాయిలో ఆశించిన ఆడియన్స్ కి అంత బలం రామం రాఘవంలో కనిపించలేదు. రెండు కారణాలు స్పష్టంగా చెప్పొచ్చు. ఒకటి క్యాస్టింగ్ లో కీలకమైన కొడుకు పాత్రను ధనరాజే స్వయంగా పోషించడం. తనకు క్రౌడ్ ఫుల్ చేసే ఇమేజ్ ప్రస్తుతం లేదు. ఇంకో ఆర్టిస్టుని ఎంపిక చేసుకుని దర్శకత్వ బాధ్యతలకు పరిమితమైతే బాగుండేది. రెండోది తన క్యారెక్టర్ కు పెట్టిన నెగటివ్ ట్విస్ట్ అనేది జనాలు అంత సులభంగా రిసీవ్ చేసుకునేది కాదు. కథ ప్రకారం మంచి పాయింటే కానీ దాని చుట్టే సెకండాఫ్ భావోద్వేగాన్ని తిప్పడం తమిళంలో అయితే చూస్తారేమో కానీ మన దగ్గర రీసివ్ చేసుకున్న దాఖలాలు తక్కువ.