ప్రభాస్ కెరీర్లో మొదటిసారి హారర్ జానర్ లో చేస్తున్న సినిమా ది రాజా సాబ్. కథేంటి లాంటి లీకులు రాకుండా దర్శకుడు మారుతీ జాగ్రత్త పడుతున్నారు కానీ ఒక డిఫరెంట్ థియేటర్ అనుభూతి ఖాయమనే రేంజ్ లో యూనిట్ తెగ ఊరిస్తోంది. ముఖ్యంగా హాస్యం విషయంలో వంద శాతం నవ్వులకు కొదవ లేకుండా ప్రత్యేక ఎపిసోడ్స్ డిజైన్ చేశారట. హీరోయిన్లు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ ని సైతం వీటిలో భాగం చేశారంటే ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అసలు మ్యాటర్ ఇది కాదు. ప్రభాస్ చిత్రాల్లో ఎన్నడూ లేనంతగా హాస్య నటుల గ్యాంగ్ ని ఇందులో వాడుకున్నారు. అలాన్నీ ఒకరిద్దరు కాదండోయ్.
సీనియర్లలయిన బ్రహ్మానందం, అలీతో పాటు కొత్త తరం నుంచి వెన్నల కిషోర్, సప్తగిరితో పాటు తమిళం నుంచి యోగిబాబు, వీటివి గణేష్ లను రాజా సాబ్ కోసం తీసుకొచ్చారు. వీళ్ళ మీద సన్నివేశాలు హిలేరియస్ గా వచ్చాయని టాక్. ఒక పాడుబడిన బంగాళాలో దెయ్యం చుట్టూ జోకులు నడిపించడం రొటీన్ అయిపోయిన ట్రెండ్ కనక దాని స్థానంలో ప్రభాస్ తో కామెడీ చేయించి వీళ్ళ ద్వారా వాటిని పండించే విధానం కొత్తగా ఉంటుందని సమాచారం. ముఖ్యంగా సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ అయ్యాక వచ్చే సీన్లు నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ఇవ్వడం ఖాయమని వినికిడి. వింటుంటే ఆసక్తి రేగుతోంది కదూ.
అలాని కమర్షియల్ అంశాలకు ఎలాంటి లోటు ఉండదట, వింటేజ్ ప్రభాస్ ని ఫైట్లు, పాటల్లో చూడొచ్చు. తమన్ కంపోజ్ చేసిన ఊర మాస్ సాంగ్స్ మిర్చి, బిల్లా, డార్లింగ్ ని మించి ఉంటాయట. సంజయ్ దత్ కీలక పాత్ర పోషించిన రాజా సాబ్ విడుదల ఎప్పుడనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఏప్రిల్ 10 వదులుకున్నాక ఇప్పుడు దసరా పండగ వైపు చూస్తున్నారు. సోలో రిలీజ్ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. విజయదశమికి పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వాటిలో ఏవైనా వాయిదా పడొచ్చనే డౌట్ తో ఇంకా అనౌన్స్ మెంట్ ఇవ్వలేదు. ఒకవేళ ఓకే అనుకుంటే అక్టోబర్ మొదటివారంలోనే ది రాజా సాబ్ వచ్చేస్తాడు.