చావా తెలుగులో రిలీజ్ లేనట్టేనా…??

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలన్నట్టు ఒక సినిమాని మల్టీ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయాలనుకున్నప్పుడు వీలైనంత త్వరగా ఆ పని చేసేయాలి. చావా టీమ్ ఈ సూత్రం మర్చిపోయింది. కేవలం హిందీ వెర్షన్ ని విడుదల చేసి ఇతర బాషల నుంచి డబ్బింగ్ కోసం వస్తున్న డిమాండ్ చూసి ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంటోంది. నిజానికి ఇలా జరగడానికి కారణం లేకపోలేదు. శంభాజీ మహారాజ్ మరాఠా వీరుడు. ఉత్తరాది రాష్ట్రాలు తప్ప బయట వాళ్ళు దీన్ని అంతగా రిసీవ్ చేసుకోరేమోననే అనుమానంతో వెనుకడుగు వేశారు. తేడా కొడితే పబ్లిసిటీ ఖర్చులు కూడా రావని వాళ్లకు తెలుసు.

దాంతో ఎందుకొచ్చిన రిస్క్ లెమ్మని చావా అనువాదం చేయకుండా వదిలేశారు. నిజంగా తెలుగులో డబ్ చేసి ఉంటే బ్రహ్మాండమైన ఆదరణ దక్కేదా అంటే ఖచ్చితంగా ఔనని చెప్పలేం. ఎందుకంటే గతంలో జోధా అక్బర్, బాజీరావు మస్తానీ లాంటివి హిందీలో తప్ప మిగిలిన భాషల్లో అద్భుతాలు చేయలేదు. తానాజీ ఒరిజినల్ కే పరిమితమయ్యింది. ఇవే కాదు చావా నిర్మాణ సంస్థ మాడాక్ నిర్మించిన గత చిత్రం స్త్రీ 2 సైతం డబ్బింగ్ కి నోచుకోలేదు. వందల కోట్లు వసూలు చేస్తున్న టైంలోనూ నిర్ణయం మార్చుకోలేదు. సో ఇప్పటికిప్పుడు చావాని డబ్బింగ్ చేసి వదిలితే స్పందన దక్కడం అనుమానమే. ఇక్కడింకో రిస్కుంది.

ఇటీవలే గేమ్ ఛేంజర్, స్కై ఫోర్స్ లాంటి ప్యాన్ ఇండియా సినిమాలను వేధించిన హెచ్డి పైరసీ చావాకు మొదటి రోజే అంటుకుంది. ఆన్ లైన్లో దొంగతనంగా చూసిన వాళ్ళు తక్కువేం లేరు. ఒకవేళ ఇది జరగకపోయి ఉంటే నెంబర్లు మరింత భారీగా నమోదయ్యేవని ట్రేడ్ అభిప్రాయపడుతోంది. విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ హిస్టారికల్ డ్రామా ఫైనల్ గా 500 కోట్లకు పైగా కలెక్షన్లు అందుకుంటుందనే నమ్మకం బయ్యర్లలో కనిపిస్తోంది. కానీ అంత సులభమైతే కాదు. ఇదే జోరుని కనీసం నాలుగు వారాలకు పైగా చూపించగలిగితేనే సాధ్యమవుతుంది. ఈ నెలాఖరు శివరాత్రి వరకు ఆ ఛాన్స్ అయితే ఉంది.